తిరుమలలో విస్తృత తనిఖీలు
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. వేసవి సెలవులు తోడు కావడం వల్ల శ్రీవారిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులతో క్రిక్కిరిసిపోతోంది. బుధవారం నాడు 66,616 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 27,837 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు.
ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 2.95 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 26 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 నుంచి 14 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్‌లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది అన్నప్రసాదాలు, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో టీటీడీ అదనపు కార్యనిర్వాహక అధికారి సీహెచ్ వెంకయ్య చౌదరి తనిఖీ చేశారు. భక్తులకు అందుతున్న సేవలు, సౌకర్యాలు, వసతుల కల్పనపై ఆరా తీశారు. నేరుగా భక్తులతో మాట్లాడారు. వివిధ కౌంటర్ల పనితీరును అడిగి తెలుసుకున్నారు.
తొలుత వెంకయ్య చౌదరి శ్రీవారి ఆలయం ఎదురుగా అఖిలాండం వద్ద ఉన్న కొబ్బరికాయలు విక్రయ కేంద్రంలో తనిఖీలు నిర్వహించారు. టీటీడీ నిర్దేశించిన ధర కంటే అధిక రేటుకు ఎట్టి పరిస్థితుల్లోనూ విక్రయించకూడదని సిబ్బందిని సూచించారు. వేసవిలో భక్తుల రద్దీ పెరుగుతున్నుందున చాలినంత స్టాక్‌ను నిల్వ ఉంచుకోవాలని చెప్పారు.
అనంతరం ఆయన టీటీడీ ప్రచురణల విక్రయ కేంద్రానికి వెళ్లారు. అక్కడి స్టాక్‌ను పరిశీలించారు. అగరబత్తులు, పంచగవ్య ఉత్పత్తుల విక్రయాలను పరిశీలించారు. సకాలంలో పంచగవ్య ఉత్పత్తులను భక్తులకు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రం మొత్తం సరఫరా చేయడానికి తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
అదే విధంగా టీటీడీ డాలర్ల విక్రయ కేంద్రాన్ని సందర్శించారు అదనపు ఈఓ. డాలర్ల విక్రయాన్ని పరిశీలించారు. సిబ్బంది పనితీరు గురించి భక్తులను అడిగి తెలుసుకున్నారు. రోజువారీ అమ్మకాల వివరాలు, వాటికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అక్కడి స్టాక్ పరిశీలించారు.












Click it and Unblock the Notifications