TTD: శ్రీవారి దర్శనంలో మార్పు - టీటీడీ కీలక ప్రకటన..!!
తిరుమలలో రథసప్తమికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. రథసప్తమి ఏర్పాట్ల పైన టీటీడీ పాలక మండలి ప్రత్యేకంగా సమావేశమైంది. పలు నిర్ణయాలు తీసుకుంది. మినీ బ్రహ్మోత్సవం గా నిర్వహించే రథసప్తమిని ప్రతీ ఏటా టీటీడీ ఘనంగా నిర్వహిస్తోంది. ఈ సారి కూడా అదే తరహాలో ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు రెండు లక్షల మంది పైగా భక్తులు వస్తారని అంచనా. ఇదే సమయం లో తిరుపతి స్థానికులకు దర్శన కోటాలో మార్పులు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది.
టీటీడీ నూతన పాలక వర్గం నిర్ణయం మేరకు తిరుపతి స్థానికులకు ప్రతీ నెలా తొలి మంగళవారం ప్రత్యేకంగా దర్శనం ఏర్పాటు చేస్తున్నారు. వీరి కోసం తిరుపతిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా టోకెన్లు జారీ చేస్తున్నారు. స్థానికులు తమ ఆధార్ కార్డు ద్వారా ఈ టోకెన్లు పొందేలా అవకాశం కల్పించారు. అయితే, ఫిబ్రవరి తొలి మంగళవారం రథసప్తమి కావటంతో టీటీడీ ఈ సారి దర్శనంలో మార్పు చేస్తూ నిర్ణయం తీసుకుంది. తొలి మంగళవారం బదులుగా.. రెండో మంగళ వారం దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ ప్రకటించింది.

రథసప్తమి నాడు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు వస్తారని టీటీడీ భావిస్తోంది. దీంతో, స్థానిక భక్తులకు దర్శన కోటా రెండో మంగళవారం (ఫిబ్రవరి 11) రోజున అమలు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు తిరుమలలోని బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్, తిరుపతి లోని మహతీ ఆడిటోరియంలో 9వ తేది ఆదివారం టోకెన్లను జారీ చేయనున్నట్లు అధికారులు వివరించారు. స్థానికులు ఈ మార్పును గమనించి టోకెన్లు పొందాలని భక్తులకు టీటీడీ సూచన చేసింది. ఇక, రథసప్తమి వేళ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications