శ్రీవారి భక్తులకు రోజూ 5,000 వరకు టోకెన్లు: అలిపిరి టోల్ ప్లాజా తనిఖీల్లో..
Tirumala: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం నాడు 72,174 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 35,192 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 2.88 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం వరకు క్యూలైన్ ఏర్పడింది. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 20 నుంచి 22 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

వేసవి సెలవుల కారణంగా గత వారం రోజులుగా తిరుమలలో భక్తుల తాకిడి అనూహ్యంగా పెరిగింది. ఈ క్రమంలో అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. వైకుంఠం కంపార్టుమెంట్లు, నారాయణగిరి షెడ్లు, బయట క్యూలైన్లలో వేచి ఉన్న భక్తుల కోసం టీటీడీ నిరంతరాయంగా అన్నప్రసాదం, మంచినీటిని అందజేసే ఏర్పాట్లు చేసింది.
కాగా- టీటీడీ కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు, ఏఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి, ఇతర అధికారులతో కలసి అలిపిరి టోల్ ప్లాజా సెంటర్ ను పరిశీలించారు. లగేజీ స్కానింగ్ కేంద్రం సిబ్బందితో మాట్లాడారు. అనంతరం భూదేవి కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన దివ్య దర్శనం టోకెన్లు జారీని పరిశీలించారు.
అన్ని కౌంటర్ల పనితీరును స్వయంగా పర్యవేక్షించారు. అనంతరం భక్తులతో మాట్లాడారు. టీటీడీ టోకెన్ల జారీ ప్రక్రియపై భక్తులను అడిగి తెలుసుకున్నారు. వారి నుంచి ఫీడ్ బ్యాక్ స్వీకరించారు. శ్రీవారి మెట్టు దివ్యదర్శనం టోకెన్లను జారీ చేయడానికి నాలుగు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశామని అన్నారు.
శ్రీవారి మెట్టు మార్గం ద్వారా కాలినడకన వెళ్లే దివ్యదర్శనం భక్తులకు టోకెన్లను అక్కడే జారీ చేయడం వల్ల భక్తులు అసౌకర్యానికి గురౌతున్నారనే ఫిర్యాదులు రావడంతో భూదేవి కాంప్లెక్స్ కు తాత్కాలికంగా శుక్రవారం సాయంత్రం నుండి మార్చామని అన్నారు. శ్రీవారి మెట్టు మార్గం ద్వారా వెళ్లే భక్తులకు అలిపిరి భూదేవి కాంప్లెక్స్ లో రోజుకు సగటున 5,000 టోకెన్లు జారీ చేస్తున్నామని చెప్పారు.
అలిపిరిలో పటిష్టంగా టోకెన్ల జారీ యంత్రాంగం, భక్తులకు సౌకర్యవంతంగా రవాణా వసతులు, భద్రతా ఉందని ఈవో తెలిపారు. శ్రీనివాస మంగాపురంలో టోకెన్లు జారీ చేయడానికి ఆర్కియాలజీ విభాగం అనుమతులు రావాల్సి ఉందని, అవి వచ్చిన వెంటనే అక్కడ టోకెన్లు జారీ చేస్తామని శ్యామలరావు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications