TTD: పవన్ సీరియస్, టీటీడీ బోర్డు అత్యవసర భేటీ - కీలక నిర్ణయం..!!
తిరుపతిలో తొక్కిసలాట ఘటన తరువాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దీని పైన ఇప్పటికే బాధ్యులైన అధికారుల పైన ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు తీసుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ టీటీడీ బోర్డు..అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేసారు. ముఖ్యమంత్రి సమీక్షలో బోర్డు ఛైర్మన్ - ఈవో మధ్య వాగ్వాదం సంచలనంగా మారింది. ఇదే సమయంలో పవన్ బోర్డు ముందు కీలక డిమాండ్ ఉంచారు. దీని పైన చర్చించి నిర్ణయం తీసుకునేందుకు టీటీడీ పాలక మండలి అత్యవసర సమావేశానికి నిర్ణయించింది.
పాలక మండలి సమావేశం
తిరుపతి తొక్కిసలాట ఘటన దేశ వ్యాప్తంగా చర్చకు కారణమైంది. ఈ ఘటనలో అధికారుల బాధ్యతా రాహిత్యం పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో, బాధ్యులైన అధికారుల పైన చర్యలు తీసుకుంటూ చంద్రబాబు ప్రకటన చేసారు. డిప్యూటీ సీఎం పవన్ సైతం టీటీడీ నిర్వహణ తీరు పైన సీరియస్ అయ్యారు. టీటీడీ వీఐపీ కల్చర్ వీడాలని ఆగ్రహం వ్యక్తం చేసారు. జరిగిన ఘటన కు భక్తులకు క్షమాపణ చెప్పారు. టీటీడీ ఈవో, ఏఈవో మధ్య సమన్వయం లేదని పవన్ ఫైర్ అయ్యారు. టీటీడీ, అధికారులు మధ్య సమన్వయ లోపంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని మండిపడ్డారు. పోలీసుల తీరు పైన ఆగ్రహం వ్యక్తం చేసారు.

పవన్ సూచన పై చర్చ
ఇదే సమయంలో పవన్ టీటీడీ పాలక మండలికి కీలక సూచన చేసారు. దుర్ఘటనలో మరణించిన భక్తుల ఇళ్లకు పాలక మండలి సభ్యులు..అధికారులు వెళ్లి పరిహార చెక్కులు ఇవ్వటంతో పాటుగా వారికి క్షమాపణ కోరాలని సూచించారు. దీంతో, టీటీడీ పాలక మండలి ఈ రోజు అత్యవసరంగా సమావేశం కావాలని నిర్ణయించింది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన పైన చర్చించ నుంది. అదే విధంగా వైకుంఠ ద్వార దర్శనం పది రోజుల పాటు నిర్వహణ పైన ఆలోచన చేయాలని.. తిరుపతిలో టోకెన్ల జారీ పైన సమీక్షించాలంటూ చంద్రబాబు చేసిన సూచనల తో పాటుగా పవన్ డిమాండ్ పైన బోర్డు సమావేశంలో చర్చించనున్నారు.

బాధితుల వద్దకు బోర్డు సభ్యులు
ఈ రోజు జరిగే సమావేశంలో వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల జారీ తొక్కిసలాటలో మృతుల కుటుంబాలకు పరిహారంపై తీర్మానం చేయనున్నారు. ఇవాళ సాయంత్రానికి పరిహారం చెక్కులు తయారుచేసే అంశంపై చర్చ జరగనుంది. ముగ్గురు టీటీడీ బోర్డు సభ్యుల బృందం శనివారం ఉదయం మృతుల గ్రామాలకు వెళ్లి చెక్కులు అందజేసేలా ఇప్పటికే ప్రతిపాదన సిద్దమైంది. ఎవరెవరు ఈ బృందంలో ఉండాలి.. ఏ రకమైన కార్యాచరణతో భవిష్యత్ నిర్ణయాలు తీసుకోవాలో ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. అయితే, ఈ ప్రత్యేక సమావేశంలో ఛైర్మన్, ఈవో, ఏఈవో మధ్య సమన్వయం లేకపోవటంతో ఎలాంటి చర్చ జరుగుతుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications