తిరుమలలో ఇకపై జియో ఫెన్సింగ్ ఏర్పాటు
తిరుమలలో భక్తుల అనూహ్య రద్దీ నెలకొంది. ప్రస్తుతం క్యూలైన్లలో ఉండే భక్తులకు స్వామివారిని దర్శించుకోవడానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. 12 నుండి 14వ తేది వరకు వరుస సెలవుల రానున్న నేపథ్యంలో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో టీటీడీ కీలక నిర్ణయాలను తీసుకుంది. భక్తుల తాకిడి నేపథ్యంలో.. 13వ తేదీన ఆదివారం నాడు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు వెల్లడించింది.
అంటే 12వ తేది శనివారం వీఐపీ దర్శనానికి సంబంధించిన ఎలాంటి సిఫారసు లేఖలను కూడా టీటీడీ అధికారులు స్వీకరించరు. సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం కల్పించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వరుస సెలవుల వల్ల వచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా విస్తృత ఏర్పాట్లు చేపట్టారు.

కాగా.. తిరుమలలోని అన్ని దుకాణాలు, హోటళ్లు, వాణిజ్య సంస్థల వివరాలను డిజిటల్ విధానంలో సమగ్రంగా అందుబాటులోకి తీసుకురావడానికి తాజాగా టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. లైసెన్సుల పర్యవేక్షణను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి ప్రత్యేకంగా ఓ యాప్ను రూపొందిస్తోంది. అమరావతి సొల్యూషన్స్ సంస్థ దీనికి రూపకల్పన చేస్తోంది. ఈ యాప్ స్థితిగతులపై టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి సీహెచ్ వెంకయ్య చౌదరి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు ఓ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. యాప్ డెవలప్మెంట్ గురించి వివరించారు. తిరుమలలో ఉండే అన్ని దుకాణాలు, వ్యాపార సంస్థలు, హోటళ్లు, ఇతర వాణిజ్య కార్యకలాపాలకు సంబంధించిన పూర్తి సమాచారం, లైసెన్స్ వివరాలు, వాటి గడువు తేదీలు తదితర అంశాలు ఒకే వేదికపై అందుబాటులో ఉండేలా యాప్ ను రూపొందిస్తున్నామని తెలిపారు. జియో ఫెన్సింగ్ టెక్నాలజీ ఆధారంగా దుకాణాల ఖచ్చితమైన స్థానాలను గుర్తించవచ్చని, దీనివల్ల వాటి నిర్వహణ, పర్యవేక్షణ మరింత సులభతరమౌతుందని చెప్పారు.
అనంతరం యాప్ రూపకల్పన పురోగతి, అందులో పొందుపరుస్తున్న సదుపాయాలు, జియో ఫెన్సింగ్ వ్యవస్థ అమలు, లైసెన్సింగ్ నిర్వహణ తదితర అంశాలపై అదనపు ఈవో సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారదర్శకతకు ప్రాధాన్యతనిస్తూ యాప్ ను అభివృద్ధి చేయాలని సూచించారు. అన్ని వ్యాపార సంస్థల వివరాలను సమగ్రంగా నమోదు చేసి, సేవల నిర్వహణను మరింత మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.














Click it and Unblock the Notifications
