TTD: సామాన్య భక్తుడిలా క్యూ లైన్ లో భూమన - మెటల్ డిటెక్టర్ తో తనిఖీలు..!!
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బ్రహ్మోత్సవాల నిర్వహణకు టీటీడీ సమాయత్తం అవుతోంది. ఈ నెల 5న టీటీడీ నూతన పాలకవర్గం సమావేశం కానుంది. ఈ ఏడాది జరిగే రెండు వరుస బ్రహ్మోత్సవాల నిర్వహణ పైన నిర్ణయాలు తీసుకోనుంది. ఛైర్మన్ భూమన ఆకస్మికంగా సాధారణ భక్తుడి తరహాలో క్యూ లైన్ లోకి వెళ్లారు. సహచర భక్తులకు అందుతున్న వసతులను పరిశీలించారు. భద్రతా సిబ్బంది క్యూ లైన్ లో వచ్చిన భూమనను తనిఖీలు చేసారు.
క్యూ లైన్ లో ఛైర్మన్ భూమన : టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2లో సర్వదర్శనం భక్తుల కోసం టీటీడీ కల్పించిన వసతులను పరిశీలించారు. సామాన్య భక్తులకు అందుతున్న అన్నప్రసాదం, తాగునీరు, కాఫీ, టీ వంటివి సకాలంలో అందుతున్నదీ, లేనిదీ అడిగి తెలుసుకున్నారు. అన్నప్రసాదం భక్తులకు సరిపోయేంతగా పెట్టాలని సిబ్బందికి సూచించారు.

క్యూ కాంప్లెక్స్ లోకి ఎన్ని గంటలకు ప్రవేశించారు, దర్శనానికి ఎంత సమయం పడుతోందన్న విషయాలను భక్తుల నుండి తెలుసుకున్నారు. ఉదయం నుండి ఇప్పటివరకు 47 కంపార్ట్మెంట్ల నుంచి టోకెన్ లేని భక్తులను దర్శనానికి పంపామని, దర్శనానికి 14 గంటల సమయం పడుతుందని ఛైర్మన్ కు విజిలెన్స్ అధికారులు వివరించారు.
మెటల్ డిటెక్టర్ తో తనిఖీలు : అంతకుముందు సామాన్య భక్తుడి తరహాలో వైకుంఠం-2 క్యూ కాంప్లెక్స్ లోకి ఛైర్మన్ ప్రవేశించారు. మెటల్ డిటెక్టెర్ ద్వారా స్వయంగా తనుఖీలు చేయించుకున్నారు. అధికమాసం కారణంగా ఈ ఏడాది సెప్టెంబర్ 18 నుండి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి.
పెరటాసి మాసం కూడా వస్తున్నందువల్ల భక్తుల రద్దీ అత్యధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ వెల్లడించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముఖ్యంగా సెప్టెంబరు 22న గరుడ సేవ, 23న స్వర్ణరథం, 25న రథోత్సవం, 26న చక్రస్నానం, ధ్వజావరోహణం నిర్వహించనున్నారు.

బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు : బ్రహ్మోత్సవాల కారణంగా సెప్టెంబరు 18 నుండి 26వ తేదీ వరకు, తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, సహస్రదీపాలంకరణ సేవలు రద్దు చేసారు. ముందస్తుగా ఆర్జిత బ్రహ్మోత్సవం సేవాటికెట్లు బుక్ చేసుకున్న గృహస్తులను వారికి సూచించిన వాహనసేవలకు మాత్రమే అనుమతించాలని నిర్ణయించారు.
బ్రహ్మోత్సవాలలో అన్ని ప్రత్యేక దర్శనాలు రద్దు చేసారు. అదే విధంగా వీఐపీ సిఫార్సు లేఖలను ఆ సమయంలో స్వీకరించమని టీటీడీ ప్రకటించింది. నడక మార్గాల్లో క్రూరమృగాల కదలికల నేపథ్యంలో భక్తుల భద్రత దృష్ట్యా ఆంక్షలు కొనసాగుతున్నాయి. భక్తుల విజ్ఞప్తి మేరకు అటవీ శాఖ అనుమతితో త్వరలో ఈ నిబంధనలు సడలిస్తామని టీటీడీ చెబుతోంది.












Click it and Unblock the Notifications