TTD: భక్తుల ఇబ్బందులు తొలిగించటానికే ఈ నిర్ణయం - ఛైర్మన్ కీలక ప్రకటన..!!
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతోంది. భక్తులకు వేగంగా దర్శనంతో పాటుగా సేవల విషయంలో టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. దర్శనం కోసం ఏఐ ఆధారిత సేవలను వినియోగించుకోవాలని టీటీడీ భావించింది. ఈ మేరకు అధ్యయనం కోసం పలు సంస్థలతో టీటీడీ సంప్రదింపులు చేసింది. కాగా, మాజీ ఈవో.. సీఎస్ గా పని చేసిన ఎల్వీ సుబ్రమణ్యం ఈ అంశం పైన కీలక వ్యాఖ్యలు చేసారు. దీని పైన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టత ఇచ్చారు.
మాజీ సీఎస్, టీటీడీ మాజీ ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. టీటీడీలో తీసుకొస్తున్న మార్పుల గురించి తన అభిప్రాయం వ్యక్తం చేసారు. శ్రీవారి దర్శనం విషయంలో సాంకేతికత వినియోగం పైన ఎల్వీ స్పందించారు. సామాన్య భక్తులకు రెండు మూడు గంటల్లో దర్శనం అసంభవమని ఆయన స్పష్టం చేశారు. ఏఐ టెక్నాలజీ ఉపయోగించినా శీఘ్రదర్శనం కష్టమేనని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఉన్న విధానానికి మించి శ్రీవారి దర్శనంలో మార్పు చేసే అవకాశం లేదని తెలిపారు. తిరుమలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం కోసం టీటీడీ ధనాన్ని వృథా చేయడం మంచిది కాదని హితవుపలికారు.
అమలు సాధ్యం కాని ఆలోచనలకు స్వస్తి పలకాలని టీటీడీకి ఎల్వీ సుబ్రహ్మణ్యం సూచించారు.

ఈ వ్యాఖ్యల పైన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. ఏఐ టెక్నాలజీ పై అవగాహన లేకుండా ఎల్వీ సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. భక్తులకు సులభతరంగా దర్శనం కల్పించే అంశంపై అధ్యయనం చేసేందుకు గూగుల్, టీసీఎస్ సంస్థలు ముందుకు వచ్చాయని చెప్పుకొచ్చారు. ఈ సంస్థలు టీటీడీకి ఉచితంగా సేవలు అందిస్తున్నాయని స్పష్టం చేశారు. దాతల సహాయంతో చేస్తున్న పనిని కూడా వృథా అనడాన్ని ఎల్వీ సుబ్రహ్మణ్యం విజ్ఞతికే వదిలేస్తున్నట్లు పేర్కొన్నారు.
శ్రీవారి దర్శనం కోసం భక్తులు రోజుల తరబడి క్యూ లైనల్లో పడిగాపులు ఉండటం మంచిదా..? అని ప్రశ్నించారు. ప్రపంచం మొత్తం ఏఐ టెక్నాలజీని వినియోగిస్తోందని గుర్తుచేశారు. భక్తుల ఇబ్బందులు తొలగించడానికే ఏఐ టెక్నాలజీని వినియోగించాలని టీటీడీ బోర్డు తీర్మానం చేసిందని..ఇందులో ఎలాంటి తప్పు లేదని బీఆర్ నాయుడు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications