తిరుమల తోపులాటలో బాలుడి మృతి వార్తలపై టీటీడీ ఛైర్మన్ సీరియస్
Tirupati: తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో తొక్కిసలాట సంభవించినట్లు వచ్చిన వార్తలను తిరుమల తిరుపతి దేవస్థానం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. ఈ వార్తలను తోసిపుచ్చింది. దీనిపై సమగ్ర వివరణ ఇచ్చింది. అన్నదాన సత్రంలో తొక్కిసలాట చోటు చేసుకోలేదని, బాలుడి మృతికి గుండె జబ్బు కారణమని వివరించింది.
ఆ బాలుడి పేరు మంజునాథ. కర్ణాటకలోని మడికెరి అతని స్వస్థలం. శ్రీవారిని దర్శించుకోవడానికి తల్లిదండ్రులు, బంధువులతో కలిసి ఇటీవలే తిరుమలకు వచ్చారు. శనివారం స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అన్న ప్రసాదాన్ని స్వీకరించడానికి తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రానికి వెళ్లారు.

అక్కడ నాలుగో నంబర్ హాలు వద్ద గేట్ తెరిచిన వెంటనే భక్తులు లోనికి వెళ్లడానికి ప్రయత్నించిన సమయంలో తోపులాట చోటు చేసుకుందని, ఈ ఘటనలో మంజునాథ కింద పడ్డాడని, ఆ వెంటనే స్పృహ కోల్పోయాడని, అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా..చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడంటూ వార్తలొచ్చాయి.
ఈ వార్తలపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. సమగ్ర వివరణ ఇచ్చారు. మంజునాథ మరణానికి సంబంధించిన వార్తలన్నీ అవాస్తవమని వెల్లడించారు. ఈనెల 22వ తేదీన మంజునాథ తిరుమల మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో సాయంత్రం భోజనం తరువాత బయటకి వస్తూ అక్కడే అపస్మారక స్థితిలోకి వెళ్లాడని అన్నారు.
వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది స్పందించి మంజునాథను తిరుమలలోని అశ్విని ఆసుపత్రిలో చేర్చారని, అనంతరం డాక్టర్ల సలహా మేరకు తిరుపతిలోని స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి షిఫ్ట్ చేశారని బీఆర్ నాయుడు చెప్పారు. అక్కడ చికిత్స పొందుతూ మంజునాథ నేడు మరణించాడని తెలిపారు.
బాలుని మరణానికి సంబంధించిన అవాస్తవ వార్తలపై టీటీడీ ఖండన
— B R Naidu (@BollineniRNaidu) February 25, 2025
ఈనెల 22వ తారీఖున కర్ణాటక రాష్ట్రం మడికెరకు చెందిన మంజునాథ అనే బాలుడు తిరుమల మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో సాయంత్రం భోజనం తర్వాత బయటకు వస్తూ అక్కడే అపస్మారక స్థితిలోకి వెళ్లడం జరిగింది.
వెనువెంటనే అక్కడ…
వాస్తవానికి మంజునాథ దీర్ఘకాలంగా గుండె జబ్బుతో బాధపడుతున్నాడని బీఆర్ నాయుడు తెలిపారు. ఆరు సంవత్సరాల కిందటే గుండెకు చికిత్స చేసుకున్నాడని పేర్కొన్నారు. వాస్తవాలు ఇలా ఉంటే కొన్ని ప్రసార మాధ్యమాలలో మంజునాథ తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో తోపులాట కారణంగా మరణించాడు అని పేర్కొనడం సరికాదని చెప్పారు.
టీటీడీపై ఇటువంటి తప్పుడు వార్తలు ప్రచురించడం, అవాస్తవాలు ప్రచారం చేయడం, తద్వారా భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బీఆర్ నాయుడు హెచ్చరించారు.












Click it and Unblock the Notifications