TTD: కిటకిటలాడుతున్న తిరుమల, భారీ క్యూ లైన్లు - అలిపిరి వద్దే ఇక..!!
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవులు.. శ్రావణ మాసం వేళ భక్తులు తిరుమల కొండకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. శిలా తోరణం వరకు భక్తుల క్యూ లైన్లు కొనసాగుతున్నాయి. 24 గంటల వరకు దర్శనానికి సమయం పడుతోంది. భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ చర్యలు చేపట్టింది. ఇదే సమయంలో టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. భక్తులకు ఇబ్బంది లేకుండా సేవలు కొనసాగించాలని అధికారులకు నిర్దేశించింది.
భక్తుల రద్దీ
తిరుమలలో వరుస సెలవుల వేళ రద్దీ ఎక్కువగా ఉంది. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయి బయట శిలా తోరణం వరకూ క్యూ లైన్ విస్తరించింది. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ఉదయం ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై నుంచి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం ఏడు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం నాలుగు గంటల సమయం పడుతుంది. కాగా, పెరుగుతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా క్యూ లైన మేనేజ్ మెంట్ ద్వారా టీటీడీ చర్యలు చేపట్టింది.

అలిపిరి వద్ద
తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబరు 24 నుండి అక్టోబరు 2వ తేదీ వరకు జరుగనున్న సాలకట్ల బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీగా ఏర్పాట్లు చేస్తోంది. భక్తులు సంతృప్తికరంగా స్వామివారిని దర్శించుకునేలా, వారి భద్రతే లక్ష్యంగా టిటిడి విజిలెన్స్, పోలీస్ సిబ్బందితో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో శ్యామలరావు అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాహన సేవలు తిలకించడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. అలిపిరి చెక్ పాయింట్ వద్ద అదనంగా మరో 12 స్కానర్‌లను త్వరిత గతిన ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. గరుడ సేవకు భక్తులు విశేషంగా తరలివస్తారని, అందుకు తగ్గట్లు భద్రతా, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు.
నవంబర్ కోటా
నవంబర్ నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేయు వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలు టీటీడీ వెల్లడించింది. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను ఆగస్టు 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఆగస్టు 23న ఉదయం 10 గంటలకు , శ్రీవాణి ట్రస్టు టికెట్ల ఆన్ లైన్ కోటాను ఆగస్టు 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోట టికెట్లను ఆగస్టు 23న మధ్యాహ్నం 3 గంటలకు, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఆగస్టు 25న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. ఇక.. గదుల కోటాను ఆగస్టు 25న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.












Click it and Unblock the Notifications