Tirumala: తిరుమలలో కరెంట్ బుకింగ్ ప్రారంభం..!!
తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో కరెంటు బుకింగ్ తిరిగి ప్రారంభించనుంది.
Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీ ప్రవేశ పెట్టిన శ్రీవాణి టికెట్ల విషయంలో పాత విధానాన్ని తిరిగి కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. శ్రీవాణి టికెట్ల కరెంటు బుకింగ్ విధానం పున:ప్రారంభిస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. గతంలో ఆఫ్ లైన్ విధానంలోనే శ్రీవాణి టికెట్లను కేటాయించే వారు. అయితే, ఆ సమయంలో టికెట్లు బ్లాక్ మార్కెట్ అవుతున్నాయనే ఆరోపణలతో గతేడాది డిసెంబర్ 29 నుంచి కరెంటు బుకింగ్ కౌంటర్‌ను మూసివేసారు. అయితే, కొంత కాలంగా భక్తుల నుంచి వస్తున్న అభ్యర్ధనలతో తిరిగి తిరుమలలో ఆఫ్‌లైన్‌లో శ్రీవాణి దర్శన టిక్కెట్లు కేటాయింపుని ప్రారంభించింది. ఇదే సమయంలో టీటీడీ మరిన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది.
తిరుమలలో కరెంట్ బుకింగ్ కౌంటర్లను తిరిగి ప్రారంభించిన టీడీపీ వీటి జారి విషయంలో కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది.టికెట్ల కోటాను కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో నిత్యం రెండున్నార వేల టికెట్లను అందుబాటులో ఉంచేవారు. కానీ, ఇప్పుడు ప్రస్తుతం వాటి సంఖ్య 150కే పరిమితం చేసింది. మార్చి1వ తేదీ నుంచి రోజు 400 టికెట్లను జారీ చేస్తామని టీటీడీ ప్రకటించింది. తిరుపతి విమానాశ్రయంలో కొద్ది రోజుల క్రితం శ్రీవాణి దర్శనం టికెట్లు రోజు 250 కేటాయించే వారు. ప్రస్తుతం వాటిని 100 టికెట్లకే పరిమితం చేస్తూ టీటీడీ నిర్ణయించింది. ఇక..ఈ రోజు నుంచి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఆన్ లైన్ విధానంలో అందుబాటులోకి తీసుకొస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది.

ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ పోర్టల్ తో పాటుగా గత నెల అందుబాటులోకి తీసుకొచ్చిన యాప్ ద్వారా భక్తులకు అందుబాటులో ఉంచింది. ఊంజల్ సేవ, కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టిక్కెట్లు విక్రయించనుంది. వీటితో పాటుగా... మార్చి, ఏప్రిల్, మే నెలలకు చెందిన ఇతర ఆర్జితసేవా టికెట్లకు ఆన్‌లైన్ ద్వారా అందుబాటులో ఉంచనున్నారు. ఆన్ లైన్ లక్కీడిప్ నమోదు ప్రక్రియ ఫిబ్రవరి 22వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఫిబ్రవరి 24 వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది.
లక్కీడిప్ లో టికెట్లు పొందిన వారు డబ్బులు చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. భక్తులు ఈ విషయాలను గమనించి శ్రీవారి ఆర్జిత సేవలను బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది. శ్రీవారి ప్రతి కోట్లాది మంది భక్తులు దర్శించుకుంటారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో ఇతరు రాష్ట్రాల ప్రజలు కూడా ఎంతో భక్తితో తిరుమలకు వస్తారు. భక్తులను దృష్టిలో పెట్టుకుని తిరుమల తిరుపతి దేవస్థానం అనేక సేవలను ఆన్ లైన్ ద్వారా అందించడం ప్రారంభించింది.












Click it and Unblock the Notifications