అమరావతిలో శ్రీవారి ఆలయాలపై టీటీడీ కీలక నిర్ణయం..!!
అమరావతి పరిధిలోని శ్రీవారి ఆలయాల పైన టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి పరిధిలోని రెండు శ్రీవారి ఆలయాల్లో భక్తులకు మరిన్ని వసతులు కల్పించడానికి చర్యలు ప్రారంభించింది. టీటీడీ జేఈవో ఆధ్వర్యంలో అధికారుల బృందం ఈ రెండు ఆలయాలను పరిశీలించింది.
అమరావతితో పాటుగా విశాఖలోని శ్రీవారి ఆలయాలను పూర్తి స్థాయిలో తీర్చి దిద్దాలని టీటీడీ నిర్ణయించింది. తాజాగా అమరావతిలో రెండు దేవాలయాల్లో వెంటనే తీసుకోవాల్సిన చర్యల పైన అధికారులు పలు నిర్ణయాలు తీసుకున్నారు.

అమరావతి పరిధిలోని ఆలయాల్లో: రాజధాని ప్రాంతంగా ఉన్న అమరావతి పరిధిలోని దేవాలయాల్లో అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు టీటీడీ నిర్ణయించింది. టీటీడీ జేఈవో వీరబ్రహ్మం ఇందుకు సంబంధించి పరిశీలన చేసి, అధికారులకు సూచనలు చేసారు. అమరావతి పరిధిలోని అనంతవరం శ్రీవారి ఆలయానికి వెళ్ళే ఘాట్ రోడ్డు ను భక్తులకు సౌకర్యవంతంగా ఆధునీకరించాలని చెప్పారు. భక్తులు ఎండకు ఇబ్బంది పడకుండా షెల్టర్ నిర్మించాలన్నారు.
ఆలయం చుట్టూ కాంపౌండ్ వాల్, దాతల సహకారంతో భక్తులు వేచి ఉండటానికి హాల్ నిర్మించడానికి చర్యలు తీసుకోవాలని శ్రీ వీరబ్రహ్మం ఆదేశించారు. కల్యాణ మండపంలో అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టాలని, ఆలయానికి వెళ్ళే ఘాట్ రోడ్డులో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని ఆయన చెప్పారు.
భక్తులకు ఉపయోగపడేలా: అనంతవరం కొండ కింద ఉన్న ఖాళీ ప్రదేశాన్ని భక్తులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అమరావతి ఆలయంలో భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా ఉద్యాన వనాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. పెండింగులో ఉన్న నాలుగు మాడ వీధులను త్వరగా ఏర్పాటు చేయాలని జేఈవో తెలిపారు. భక్తులకు పార్కింగ్ ప్రదేశం ఏర్పాటు చేయాలని, పుష్కరిణి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.
వివిధ మార్గాల ద్వారా ఆలయానికి వచ్చే భక్తుల సదుపాయం కోసం సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని ఆయన చెప్పారు. ఆలయ ముఖ ద్వారం వద్ద ఆర్చి, కాంపౌండ్ వాల్, భక్తులు వేచి ఉండే హాల్, సెక్యూరిటి గది, ఉద్యోగులు, అర్చకుల క్వార్టర్స్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
25న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల: శ్రీవారి ఆలయ సన్నిధిలో విద్యుత్ బ్లోయర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇక, వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన మే నెల కోటాను ఏప్రిల్ 24న ఉదయం 10 గంటలకు, జూన్ నెల కోటాను ఏప్రిల్ 24న మధ్యాహ్నం 3 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
మే, జూన్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఏప్రిల్ 25న ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. తిరుమలలో మే నెల గదుల కోటాను ఏప్రిల్ 26న ఉదయం 10 గంటలకు, తిరుపతిలో మే నెల గదుల కోటాను ఏప్రిల్ 27న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.












Click it and Unblock the Notifications