TTD: సిఫార్సు లేఖలు రద్దు - ఈవో ధర్మారెడ్డి కీలక ప్రకటన..!!
Tirumala: తిరుమలలో నిర్వహించే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 18 నుండి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. భక్తులు విచ్చేసే అవకాశం ఉందని, భక్తుల సౌకర్యార్థం విస్తృతంగా ఏర్పాట్లు చేపడుతున్నామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ నిర్ణయాలు ప్రకటించారు.
బ్రహ్మోత్సవాల్లో సెప్టెంబరు 18న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి చేతులమీదుగా శ్రీనివాస సేతు, ఎస్వీ ఆర్ట్స్ కళాశాల హాస్టల్ భవనం, తిరుమలలో విశ్రాంతి గృహాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయన్నారు. గరుడసేవను రాత్రి 7 గంటలకు ప్రారంభించి భక్తులందరికీ దర్శనం కల్పిస్తూ నిదానంగా ముందుకు తీసుకెళతామని తెలిపారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామని, వారికి సంతృప్తికరంగా వాహనసేవల దర్శనంతోపాటు మూలమూర్తి దర్శనం కల్పిస్తామని చెప్పారు.

బ్రేక్ దర్శనాలకు సిఫారసు లేఖలు స్వీకరించమని ఈవో కీలక ప్రకటన చేసారు. స్వయంగా వచ్చే ప్రొటోకాల్ ప్రముఖులను మాత్రమే అనుమతిస్తామని వివరించారు. వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు తదితర ప్రివిలేజ్డ్ దర్శనాలను రద్దు చేసినట్టు వెల్లడించారు. శ్రీవాణి ట్రస్టు నిధులతో ఆలయాలు నిర్మించిన ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మత్స్యకార ప్రాంతాల్లోని భక్తులకు రోజుకు వెయ్యి మంది చొప్పున బ్రహ్మోత్సవ దర్శనం చేయిస్తామని తెలిపారు. వీరికి ఉచితంగా రవాణా, భోజనం, బస కల్పిస్తామన్నారు. భక్తుల భద్రత దృష్ట్యా సెప్టెంబరు 22న గరుడసేవ నాడు ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలను రద్దు చేశామన్నారు. జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని భక్తులకు రవాణా, వైద్యం తదితర సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు.
బ్రహ్మోత్సవాల కోసం విభాగాల వారీగా ప్రత్యేక ఏర్పాట్లు చేపడతామని చెప్పారు. భక్తుల కోసం పలు ప్రాంతాల్లో జర్మన్ షెడ్లు ఏర్పాటు చేస్తామన్నారు. తొమ్మిది రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో తొమ్మిది రాష్ట్రాల నుండి కళాకారులను ఆహ్వానించి వాహనసేవల ఎదుట కళాప్రదర్శనలు ఏర్పాటు చేస్తామని వివరించారు. వాహనసేవల ఎదుట ఏనుగులు, అశ్వాలు, వృషభాలు ప్రత్యేక అలంకరణలో పాల్గొంటాయని, వీటి నిర్వహణ కోసం కేరళ నుండి నిపుణులను రప్పిస్తున్నామని చెప్పారు. అటవీ శాఖ తిరిగి ఆదేశాలు జారీ చేసే వరకు నడక మార్గాల్లో ఇప్పుడున్న నిబంధనలు కొనసాగుతాయని తెలిపారు.












Click it and Unblock the Notifications