టీటీడీ యాత్రీకుల వసతి సముదాయం తరలింపు?: టీటీడీ ఈఓ తనిఖీలో..!!
Ratha Saptami 2025: ఫిబ్రవరి 4వ తేదీన రథసప్తమి. హిందూ పంచాంగం ప్రకారం- ప్రతి సంవత్సరం మాఘ మాసంలోని శుక్ల పక్షం ఏడవ రోజును రథ సప్తమిగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ పండగను అచల సప్తమి, సూర్య జయంతిగా పిలుస్తారు. పురాణాల ప్రకారం సూర్య భగవానుడు మాఘ శుక్ల పక్షమి రోజునే జన్మించాడు.
ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉత్సవాలను నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ముందస్తు ఏర్పాట్లు మొదలు పెట్టారు. వేలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శించే అవకాశం ఉందని అంచనా వేస్తోన్నారు.

రథ సప్తమి నాడు అమ్మవారు ఏడు ప్రధాన వాహనాలపై ఊరేగనున్నారు. భక్తులను అనుగ్రహించనున్నారు. రథ సప్తమి నాడు ఉదయం 7 నుండి 8 గంటల వరకు సూర్యప్రభ వాహనం, 8:30 నుండి 9:30 గంటల వరకు హంస వాహనం, 10 నుండి 11 గంటల వరకు అశ్వ వాహనం, 11:30 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు గరుడ వాహనంపై విహరించి భక్తులను కటాక్షించనున్నారు.
మధ్యాహ్నం 1 నుండి 2 గంటల వరకు చిన్నశేష వాహనం, సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు చంద్రప్రభ వాహనం, రాత్రి 8:30 నుండి 9:30 గంటల వరకు గజ వాహనంపై దర్శనమిస్తారు. మధ్యాహ్నం 3:30 నుండి 4:30 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోని శ్రీ కృష్ణస్వామివారి ముఖ మండపంలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత కల్యాణోత్సవం, కుంకుమార్చన, బ్రేక్ దర్శనం, ఊంజల సేవలను టీటీడీ రద్దు చేసింది. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం పక్కన గల శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ఉదయం 6 నుండి 7 గంటల వరకు స్వామివారు అశ్వవాహనాన్ని అధిష్టించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు అమ్మవారి ఆలయ పరిసరాల్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. టీటీడీ విజన్- 2047లో భాగంగా తిరుచానూరు ఆలయం పరిసరాలలో భక్తులలో మరింత భక్తిభావం, ఆహ్లాదాన్ని పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
ముందుగా తోళప్ప గార్డెన్‌ను ఈవో పరిశీలించారు. అక్కడి కళ్యాణ మండపాలను ఎప్పుడు నిర్మించారు?,సౌకర్యాలు ఎలా ఉన్నాయి?, కళ్యాణ మండపాలలో తాజా పరిస్థితులు, తదితర అంశాలను టీటీడీ ఇంజినీరింగ్ విభాగం అధికారులను అడిగి తెలుసుకున్నారు. కళ్యాణ మండపాలు నిర్మించి ఇప్పటికే 60 సంవత్సరాలు పూర్తయినట్లు అధికారులు ఈవోకు తెలిపారు.
రోజూ 25,000 మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారని, రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు లేవని శ్యామలరావు అన్నారు. పరిమిత స్థలంలో టికెట్ల జారీ, లడ్డూ కౌంటర్లు ఉండడం వల్ల భక్తులకు అసౌకర్యంగా ఉంటోందని చెప్పారు. ఇప్పటికే అక్కడ ఉన్న భక్తుల వసతి గదుల సముదాయాన్ని మరో చోటికి మార్చే ఆలోచన చేస్తున్నామని అన్నారు.
ఆలయ పరిసరాల్లో టౌన్ ప్లానింగ్ నిపుణుల సహకారంతో భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఫ్రైడే గార్డెన్‌ను ఈవో పరిశీలించారు. భక్తులకు మరింత ఆహ్లాదకరంగా ఉండేలా ఏర్పాట్లు చేయడానికి గల సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించారు. ఆలయ సమీపంలోని టిటిడి స్థలాన్ని, నాలుగు మాడ వీధుల్లో అధికారులతో కలిసి కలియ తిరిగారు.












Click it and Unblock the Notifications