మీ వల్ల తిరుమలకు వచ్చే భక్తులు అసంతృప్తితో వెళ్తున్నారు- టీటీడీ
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం నాడు 71,001 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 28,637 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 3.25 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ఎనిమిది కంపార్ట్‌మెంట్లల్లో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 4 నుంచి 6 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

కాగా- తిరుమలలోని హోటళ్ల యజమానులతో టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి సీహెచ్ వెంకయ్య చౌదరి సమావేశం అయ్యారు. తిరుమల ఆస్థానమండపంలో ఈ భేటీ ఏర్పాటైంది. ఈ సందర్భంగా వెంకయ్య చౌదరి వారికి ఆదేశాలు జారీ చేశారు. భక్తల నుంచి ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ఈ భేటీ నిర్వహించినట్లు చెబుతున్నారు.
శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు వివిధ రాష్ట్రాలకు చెందిన సంప్రదాయ వంటకాలను అందించాలని, ఎలాంటి అసౌకర్యం కలగకుండా హోటళ్లలో పరిశుభ్రత, నిర్వహణ చక్కగా ఉండేలా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన ఆహార పదార్థాలను అందించాలని అన్నారు.
హోటల్ నిర్వాహకులు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల భక్తులు చాలా అసంతృప్తితో వెళుతున్నట్లు తమకు ఫిర్యాదులు అందుతున్నాయని వెంకయ్య చౌదరి తేల్చి చెప్పారు. హోటళ్ల యజమానులు చట్టబద్ధమైన నియమ నిబంధనలను పాటించాలని, ఎప్పటికప్పుడు పరిసరాలను శుభ్రపరచుకోవాలని అన్నారు.
టీటీడీ ఆరోగ్య విభాగం ప్రతిరోజు చేయవలసిన పనులతో కూడిన చెక్ లిస్ట్ అందిస్తుందని, దానిని తప్పకుండా పాటించాలని సూచించారు. టీటీడీలోని అన్ని విభాగాల అధికారులు ఎప్పటికప్పుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారని చెప్పారు. తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంతో పాటు భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలలో 33 అన్నప్రసాద కౌంటర్లలో టీటీడీ నాణ్యమైన భోజనం అందిస్తోందని అన్నారు.
అదేవిధంగా భగవంతుని సన్నిధిలో ఉండే హోటళ్ల యజమానులు కూడా టీటీడీ తరహాలోనేు నాణ్యమైన ఆహార పదార్థాలు, తినుబండారాలను భక్తులకు అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. భక్తుల ఆరోగ్యానికి హానికరమైన చైనీస్ వంటకాలను పూర్తిగా నిలిపివేయాలని సూచించారు.
హోటళ్ల నిర్వాహకులు, అక్కడ పనిచేసే సిబ్బంది సాంప్రదాయ వస్త్రధారణ ధరించి భక్తులకు సేవలందించాలని, ముఖ్యంగా తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా వస్త్రధారణ ఉండాలని వెంకయ్య చౌదరి సూచించారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.
హోటల్లో వద్ద ట్రేడ్ లైసెన్స్, జీఎస్టీ వంటి ధ్రువీకరణ పత్రాలను అధికారులకు కనిపించేలా డిస్‌ప్లే చేయాలని, భక్తులు డిజిటల్ పేమెంట్ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. హోటల్ నిర్వహణ లైసెన్సును నిర్ణీత సమయంలో రెన్యువల్ చేసుకోవాలని చెప్పారు.
అన్ని దుకాణాల్లో కూడా ధరల పట్టికను ప్రదర్శించాలని, ఆహార పదార్థాలు తయారు చేసేటప్పుడు సిలిండర్ ఏర్పాటు చేసే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సంబంధిత అధికారులు నడిగి తెలుసుకోవాలని సూచించారు. హోటళ్ల లోని వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తొలగించాలని, హోటల్లో యజమానులు సమష్టిగా పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
భక్తులకు సురక్షితమైన తాగునీరు అందించాలన్నారు నీరు, విద్యుత్తు వృధా కాకుండా వినియోగించుకోవాలని వెంకయ్య చౌదరి చెప్పారు. త్వరలో అయిదు నుండి 10 హోటళ్లలో పైలెట్ ప్రాజెక్టు కింద ఈ విధి విధానాలు అమలు అయ్యేలా నిర్వాహకులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు అవసరమైన సహాయ సహకారాలను టీటీడీ అధికారులు అందిస్తారని వివరించారు.












Click it and Unblock the Notifications