TTD: శ్రీవారి భక్తులకు టీటీడీ ప్రత్యేక విజ్ఞప్తి - దర్శనం, సేవలపై తాజా నిర్ణయంతో..!!
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ చర్యలు చేపట్టింది. కాగా, సెప్టెంబర్ 16న తిరుమల ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది. ఈ కారణంగా అష్టదళ పాదపద్మారాధన, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా సెప్టెంబర్ 15న వీఐపీ బ్రేక్ దర్శనాల సిఫార్సు లేఖలు స్వీకరించటం లేదని టీటీడీ స్పష్టం చేసింది. 16వ తేదీన టీటీడీ పాలక మండలి సమావేశం జరగనుంది. దీంతో, భక్తులకు టీడీపీ కీలక సూచనలు చేసింది.
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 02వ తేది వరకు జరగనున్న నేపథ్యంలో సెప్టెంబర్ 16న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. తమిళంలో, కోయిల్ అంటే 'పవిత్ర పుణ్యక్షేత్రం', ఆళ్వార్ అంటే "భక్తుడు", తిరు అంటే "శ్రేష్ఠo", మంజనం అంటే "స్నానం". కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అంటే గర్భగుడి మరియు ఆలయ ప్రాంగణాన్ని భక్తులు శుద్ధి చేసే కార్యక్రమం అని అర్థం. ఈ శుద్ధి జరుగుతున్న సమయంలో శ్రీవారి ప్రధాన మూర్తిని ఒక తెల్లని వస్త్రంతో కప్పి ఉంచుతారు. అన్ని దేవతా మూర్తులను మరియు ఇతర వస్తువులను గర్భగుడి నుండి బయటికి తెచ్చి, కర్పూరం, గంధం, కుంకుమ, పసుపు, కిచ్చిలి గడ్డ మొదలైన వాటితో కూడిన "పరిమళం" అనే సుగంధ మిశ్రమంతో శుభ్రం చేస్తారు.

ప్రత్యేక పూజలు
ఈ మొత్తం కార్యాచరణ ఉదయం 6 నుండి ఉదయం 10 గంటల వరకు ఒక మహా యజ్ఞం లా జరుగుతుంది. తర్వాత ప్రధాన దేవతపై ఉన్న వస్త్రాన్ని తొలగించి, లోపల ఇతర పరివార దేవతలు, దీపం మరియు పూజ వస్తువులను మరల లోనికి తీసుకొస్తారు . అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు, నైవేద్యం సమర్పిస్తారు. ఈ యావత్ కార్యక్రమం ఆగమ శాస్త్రం ప్రకారం నిర్వహించబడుతుంది. కాగా సంవత్సరానికి నాలుగు సార్లు ఈ వైదిక కార్యక్రమం నిర్వహిస్తారు. ఉగాది, ఆణివార ఆస్థానం, వైకుంఠ ఏకాదశి మరియు వార్షిక బ్రహ్మోత్సవాలు ముందు వచ్చే మంగళవారం నాడు ఈ వేడుకను నిర్వహించడం ఆనవాయితీ. దీంతో, టీటీడీ సెప్టెంబర్ 16న వీఐపీ బ్రేక్ దర్శనాలను (ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా) రద్దు చేసింది.
భక్తులకు సూచన
దీంతో, సెప్టెంబర్ 15న ఎటువంటి సిఫార్సు లేఖలు స్వీకరించరని టీటీడీ వెల్లడించింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేసింది. తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 02వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 23వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు మరియు సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వాహన సేవలు ఉంటాయి. బ్రహ్మోత్సవాల వేళ పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారని టీటీడీ అంచనా వేస్తోంది. ఇందు కోసం ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. గరుడ వాహన సేవ నాడు కొండ పైకి ఘాట్ రోడ్ ద్వారా నిలిపి వేయాలని నిర్ణయం తీసుకున్నారు.












Click it and Unblock the Notifications