శ్రీవారి దర్శనం ఆరోపణలపై క్లారిటీ ఇచ్చి టీటీడీ
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. ఆదివారం నాడు 69,333 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 22,606 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.53 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్టుమెంట్లల్లో భక్తులు వేచి ఉండనక్కర్లేదు. క్యూలైన్ల ద్వారా నేరుగా స్వామివారి దర్శనానికి వెళ్లొచ్చు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 4 నుంచి 6 గంటల సమయం పట్టింది. దీపావళి పండగ సెలవుల వల్ల రద్దీ పెరిగే అవకాశం ఉందని టీటీడీ అధికారులు అంచనా వేస్తోన్నారు.

కాగా వివిధ పీఠాధిపతులు, స్వామిజీలకు దర్శనాలను కల్పించే విషయంలో టీటీడీ అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమౌతోన్నాయి. టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరిపై శ్రీకాకుళం జిల్లా కృష్ణాపురం ఆనందాశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి స్వామిజీ ఆరోపణలు చేయడం చర్చనీయాంశమౌతోంది. వెంకయ్య చౌదరివంటి అవగాహన లేని వారి వల్ల ధర్మం గాడి తప్పుతోందంటూ మండిపడ్డారు.
తిరుపతిలో జాతీయ సాధు సదస్సుకు హాజరైన 300 మంది స్వామిజీలు, పీఠాధిపతులకు శ్రీవారి దర్శనం కల్పిస్తానని కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు, ఈవో వెంకయ్య చౌదరి తొలుత హామీ ఇచ్చారని చెప్పారు. దర్శనానికి వెళ్లినప్పుడు మాత్రం ఇచ్చిన మాట తప్పారని, స్వామీజీలను ఘోరంగా అవమానించారని మండిపడ్డారు.
హిందూ సనాతన ధర్మాన్ని ఆచరిస్తామని హామీ ఇచ్చిన తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం.. అదికారంలోకి వచ్చిన తరువాత విఫలమైందని శ్రీనివాసానంద సరస్వతి ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో స్వామీజీలకు టీటీడీ అధికారులు గౌరవం ఇచ్చేవారని, వీఐపీలకు మించి స్వామివారి దర్శనం చేయించే వారని అన్నారు.
ఈ ఆరోపణలపై టీటీడీ అధికారులు స్పందించారు. అవాస్తవమని అన్నారు. శ్రీనివాసానంద సరస్వతి 50 మందికి బ్రేక్ దర్శనం, 550 మందికి ప్రత్యేక ప్రవేశ దర్శనంతో పాటు తిరుమలలో వసతి కల్పించాలని తమను కోరారని పేర్కొన్నారు. ఆయన అడిగినంత మేరకు వసతి కల్పించడానికి అంగీకరించామని చెప్పారు.
ఆదివారం నాడు తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని, ఆ రోజున స్వామిజీ అడిగినంతమందికీ దర్శనాన్ని కల్పించడం సాధ్యం కాదని వివరించారు. 600 మంది సంఖ్యను తగ్గించాలని వెంకయ్య చౌదరి కోరారని పేర్కొన్నారు. దీనికి స్వామీజీ అంగీకరించలేదని, అడిగినంత మందికీ దర్శనం కల్పించాలని పట్టుబట్టారని చెప్పారు.
తాను అడిగినంతమందికి శ్రీవారి దర్శనం టికెట్లను మంజూరు చేయలేదనే కోపంతో మీడియా సమక్షంలో వెంకయ్య చౌదరిని తీవ్రస్థాయిలో కించపరుస్తూ మాట్లాడటం ఆయన స్థాయికి తగదని టీటీడీ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications