తిరుమల శ్రీవారి ఆలయంలో ఏకాంత అభిషేకం- ఆసక్తికర పూజా విధానం
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. శనివారం నాడు 95,080 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 39,668 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 3.47 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం వరకు క్యూ లైన్ ఏర్పడింది. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 20 నుండి 22 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

ఈ ఉదయం శ్రీవారి ఆలయంలో శ్రీభోగ శ్రీనివాసమూర్తికి సహస్రకలశాభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు టీటీడీ అర్చకులు. శ్రీవారి పంచ బేరాలలో ఒకటిగా పూజలను అందుకుంటోన్నాడు భోగ శ్రీనివాసమూర్తి. తిరుమల శ్రీవారి ఆలయంలో పల్లవరాణి సామవై ప్రతిష్ఠించిన దినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక సహస్రకలశాభిషేకాన్ని ఏకాంతంగా నిర్వహించారు.
ఇందులో బాగంగా ఈ తెల్లవారు జామున 6 నుంచి ఉదయం 8:30 గంటల వరకు శ్రీవారి ఆలయంలోని గరుడాళ్వార్ సన్నిధిలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు, శ్రీ భోగశ్రీనివాసమూర్తి, శ్రీ విష్వక్సేనులవారిని వేంచేపు చేశారు.
శ్రీవారి మూలమూర్తికి ముందు గరుడాళ్వార్ సన్నిధిలో కౌతుకమూర్తి అయిన శ్రీ మనవాళపెరుమాళ్, అభిముఖంగా శ్రీ విష్వక్సేనులవారిని ఆశీసునులు చేశారు. తర్వాత శ్రీవారి మూలమూర్తిని శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి కలుపుతూ దారం కట్టి అనుసంధానం చేశారు. దీనితో- శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి నిర్వహించే అభిషేకాధి క్రతువులు మూలమూర్తికి నిర్వహించినట్లు అవుతుంది.
అనంతరం వేద పండితులు వేద పారాయణం చేయగా, అర్చకస్వాములు ఏకాంతంగా ప్రత్యేక సహస్రకలశాభిషేకం వైభవంగా నిర్వహించారు. దీనికి చారిత్రక నేపథ్యం ఉంది. పల్లవ రాణి సామవాయి పెరుందేవి క్రీస్తు శకం 614వ సంవత్సరం, జ్యేష్ఠ మాసంలో 18 అంగుళాల పొడవు గల వెండి భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని తిరుమల శ్రీవారి ఆలయానికి కానుకగా సమర్పించారు.
పల్లవరాణి కానుకకు సంబంధించిన ఈ శాసనం ఆలయ మొదటి ప్రాకారంలోని విమాన వేంకటేశ్వరుని విగ్రహం కింది భాగంలో గోడపైన కనిపిస్తుంది. ఆగమం ప్రకారం శ్రీ భోగ శ్రీనివాసమూర్తిని కౌతుకమూర్తిగా, శ్రీ మనవాళపెరుమాళ్ గా పిలుస్తారు.
ఈ కార్యక్రమంలో తిరుమల పెదజీయర్ స్వామి, చినజీయర్ స్వామి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, ఆలయ ప్రధాన అర్చకుల్లో ఒకరైన వేణుగోపాల దీక్షితులు, డిప్యూటీ ఈవో లోకనాథం, పేష్కార్ రామకృష్ణ ఇతర అధికారులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications