టీటీడీ రికార్డు స్థాయి కలెక్షన్లు..!!
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం నాడు 70,480 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 28,923 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.17 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 26 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లల్లో వేచి ఉన్న భక్తులకు టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అన్నప్రసాదాలు, పాలు, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

కాగా- జులైలో శ్రీవారి హుండీ ఆదాయం గణనీయంగా పెరిగింది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఈ సారి అధిక ఆదాయం నమోదైనట్లు టీటీడీ వర్గాలు వెల్లడించాయి. హుండీ ద్వారా 129.45 కోట్ల రూపాయల ఆదాయం అందింది. గత ఏడాది జులైలో నమోదైన హుండీ రెవెన్యూ 125.35 కోట్ల రూపాయలు. రూ. 4.09 కోట్ల రూపాయలు అధిక ఆదాయం వచ్చింది శ్రీవారికి.
పాఠశాలలు, కళాశాలలు తెరచుకునే నెల కావడం వల్ల జులైలో సాధారణంగా రద్దీ తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ- ఈ సారి ఊహించని విధంగా భక్తుల సంఖ్య పెరగిందని, ఫలితంగా ఆదాయం వృద్ధి చెందిందని టీటీడీ అధికారులు తెలిపారు. హుండీ కలెక్షన్లు పెరగడానికి అదే కారణమైందని అన్నారు.
జులైలో 23.76 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. గత ఏడాది ఇదే నెలలో 22.13 లక్షల మంది భక్తులు సందర్శించారు. ఈ ఏడాది ఇదే నెలలో భక్తుల సంఖ్య కూడా మెరుగుపడింది. 7.4 శాతం మేర పెరుగుదల కనిపించింది. భక్తుల సంఖ్య పెరగడం వల్ల వసతి గదుల కేటాయింపు, లడ్డూ ప్రసాదాల విక్రయాల ద్వారా వచ్చే ఆదాయం కూడా పెరిగింది.
వసతి గదుల కేటాయింపుల ద్వారా గత ఏడాది జులైలో రూ. 12.47 కోట్లు రాగా, ఈ సారి ఇది రూ. 13.89 కోట్లకు పెరిగింది. తిరుపతి లడ్డూల తయారీ కూడా భారీగా పెరిగింది. గత ఏడాది జులైలో 1.04 కోట్ల మేర లడ్డూలు తయారు చేయగా.. ఇప్పుడీ సంఖ్య 1.25 కోట్లకు పెరిగింది. లడ్డూల విక్రయాల ద్వారా రూ. 41.06 కోట్ల నుంచి రూ. 50.57 కోట్లకు అధిక ఆదాయం టీటీడీకి అందింది.












Click it and Unblock the Notifications