TTD అరుదైన అవకాశం - సర్వదర్శన భక్తులకు తోమాల సేవలో శ్రీవారి దర్శనం..!!
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. గత ఇరవై రోజుల నుంచి భక్తులతో తిరుమల కిటకిట లాడుతుంది. తిరుమలలోని మాడవీధులన్నీ గోవింద నామస్మరణలతో మారుమోగిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ వేసవిలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శిలా తోరణం వరకూ భక్తుల క్యూ లైన్ విస్తరించింది. ఇదే సమయం లో టీటీడీ సర్వదర్శన భక్తులకు తోమాల సేవలో శ్రీవారి దర్శన అవకాశం కల్పించింది.
వేసవి సెలవులు పూర్తి కావస్తుండటంతో పాటు విద్యాసంస్థలు ప్రారంభం కానుండటంతో తిరుమలకు భక్తులు పోటెత్తతున్నారు. ప్రతి రోజూ కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి బయట వరకూ క్యూ లైన్ లలో భక్తులు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సమయంలోనే టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. శ్రీవాణి ట్రస్టు దాతలకు టీటీడీ శుభవార్త చెప్పింది. ఇప్పటికే ఈ ట్రస్టుకు విరాళాలు ఇచ్చి దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తుల కోసం ఇకపై ప్రత్యేకంగా వీఐపీ బ్రేక్ దర్శనాలను కేటాయించాలని నిర్ణయించింది. జూన్ 10వ తేదీ నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. ప్రస్తుతం రోజూ 1,500 శ్రీవాణి టికెట్లను టీటీడీ కేటాయిస్తోంది. ఇందులో 500 దర్శన టికెట్లను మూడు నెలల ముందుగా ఆన్‌లైన్‌లో అడ్వాన్స్ బుకింగ్ కింద కేటాయిస్తారు. అలాగే మరో 200 టికెట్లను తిరుపతి ఎయిర్‌పోర్టులో కరెంట్ బుకింగ్ కోటాలో జారీ చేస్తున్నారు. రోజూ ఆన్‌లైన్ కరెంట్ బుకింగ్ కోటా ద్వారా ఉదయం 9 గంటలకు 800 టికెట్లను జారీ చేస్తున్నారు.

సర్వదర్శన భక్తులకు తోమాల సేవలో శ్రీవారి దర్శనం
అయితే ఇప్పటికే శ్రీవాణి ట్రస్టుకు విరాళాలు అందజేసి దర్శన టికెట్ల కోసం ఎదురుచూస్తున్న వారు దాదాపు 40 వేల మందికిపైగా ఉన్నారు. వీరికి ప్రత్యేకంగా దర్శన టికెట్లు ఇవ్వాలని టీటీడీ నూతన సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసింది. ఈక్రమంలో 800 టికెట్ల కోటాలో నుంచి 300 టికెట్లను కేటాయించేందుకు ఏర్పాట్లు చేశారు. వీటిని జూన్ 10వ తేదీ నుంచి ఉదయం 9 గంటలకు విడుదల చేయనునున్నారు. 2027 మార్చి 31 వరకు ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. తిరుమలలో రద్దీ అధికంగా ఉన్న క్రమంలో శుక్రవారం తోమాల సేవలోనూ దాదాపు 1,500 మంది సామాన్య భక్తులకు టీటీడీ దర్శనం కల్పించింది. తోమాల, అర్చనసేవ సమయాల్లో సర్వదర్శన భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. అయితే శుక్రవారం అభిషేకం అనంతరం జరిగే తోమాల సేవ సమయం తక్కువ ఉండే క్రమంలో సామాన్య భక్తులను దర్శనానికి అనుమతించే విధానాన్ని గతంలో రద్దు చేశారు. కానీ ప్రస్తుతం భక్తుల రద్దీ అధికంగా ఉన్న నేపథ్యంలో శుక్రవారం తోమాల సేవలో 18 నిమిషాల వ్యవధిలో దాదాపు 1,500 మందికి దర్శనం చేయించారు.













Click it and Unblock the Notifications