శ్రీవారి సేవలో కొత్తగా వీరికీ TTD భాగస్వామ్యం - అర్హతలు, నమోదు ప్రక్రియ..!!
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. వరస సెలవు దినాలు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. టోకెన్ల కోసం భక్తులు పెద్ద సంఖ్యలో నిరీక్షిస్తున్నారు. కాగా.. శ్రీవారి సేవ పరిధిని విస్తరించాలని టీటీడీ భావిస్తోంది. భక్తులకు ఇప్పటి వరకు సేవలు అందించేందుకు పరిమితం అయిన ఈ సేవా విధానంలో కీలక మార్పులకు సిద్దమైంది. మరి కొన్ని రంగాల నిష్ణాతులకు అవకాశం కల్పిస్తోంది. అర్హతలు.. నమోదు ప్రక్రియ పైనా టీటీడీ స్పష్టత ఇస్తోంది.
టీటీడీ శ్రీవారి సేవ పరిధి పెంపు పైన కసరత్తు చేస్తోంది. దశాబ్దాల కాలంగా తిరుమలలో శ్రీవారి సేవకులు స్వచ్చందంగా సేవలు అందిస్తున్నారు. భక్తులకు వసతి, భోజన సేవలకే పరిమితమైన ఈ కార్యక్రమంలో ఇకపై వైద్యులు వంటి వృత్తి నిపుణులకు అవకాశం కల్పించారు. ఈ సేవ కోసం భారీ స్పందన వచ్చింది. జూన్ 5న పైలట్ ప్రాజెక్టుగా శ్రీవారి వైద్యసేవ ప్రారంభమైంది. స్విమ్స్, బర్డ్, పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి, సెంట్రల్ హాస్పిటల్, అశ్విని హాస్పిటల్, ఆయుర్వేద ఆసుపత్రులు, గోశాలల్లో సేవలందించే అవకాశం కల్పించారు. స్పెషలిస్ట్ వైద్యులు కనీసం మూడు రోజులు, ఎంబీబీఎస్ వైద్యులు ఏడు రోజుల సేవా స్లాట్‌ను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. వైద్యసేవ ప్రారంభమైన 83 రోజుల్లోనే 723 మంది వైద్యులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోగా, 586 దరఖాస్తులను టీటీడీ ఆమోదించింది.

టీటీడీ తాజా ప్రణాళికలు
కాగా, అందులో భాగంగా స్పెషలిస్టులు, ఎంబీబీఎస్, ఆయుర్వేద, పశువైద్యులు కలిపి ఇప్పటికే 109 మంది వైద్యులు సేవలు అందించారు. మూడు రోజుల సేవ పూర్తి చేసిన స్పెషలిస్ట్ వైద్యులకు శ్రీవారి బ్రేక్ దర్శనం కల్పిస్తుండగా, ఏడు రోజుల సేవ చేసిన ఎంబీబీఎస్ వైద్యులకు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఉచిత దర్శనం అవకాశం ఇస్తున్నారు. కాగా.. హిందూ మతానికి చెందిన ఆసక్తిగల వైద్యులు https://ttdevasthanams.ap.gov.in/srivari-seva/instructions ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేసి, నచ్చిన ఆసుపత్రి, సేవా స్లాట్‌ను ఎంపిక చేసుకోవాలి. తర్వాత టీటీడీ ఆమోదంతో విధుల్లో చేరి రోజుకు 6 గంటల పాటు సేవలందించాల్సి ఉంటుంది. కాగా.. త్వరలో భవిష్యత్తులో శ్రీవారి విద్యాసేవ, ఇంజినీరింగ్ సేవ, రక్షణసేవలను కూడా ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.












Click it and Unblock the Notifications