TTD: తిరుమలలో ఇకపై ఈ భక్తులకు గదుల కేటాయింపు రద్దు..!!
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. భక్తుల సౌకర్యాల పెంపు దిశగా తాజాగా సమావేశమైన టీటీడీ బోర్డు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుతం ఉన్న రెండు వైకుంఠ క్యూ లైన్లను అదనంగా మూడో లైన్ ఏర్పాటు పై అధ్యయనానికి బోర్డు నిర్ణయించింది. కొత్తగా అన్ని వ్యవస్థలు ఒకే చోట ఉండేలా పరిపాలనా భవన నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఇదే సమయం లో దర్శనం.. సేవల్లోనూ కొత్త విధానాల దిశగా కసరత్తు జరుగుతోంది. తాజాగా ఎస్ఎస్డీ భక్తులకు సిఫారసు లేఖలపై గదుల కేటాయింపు రద్దు చేస్తూ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
తిరుపతిలో స్లాటెడ్ సర్వదర్శనం (ఎస్ఎస్డీ) టోకెన్లు పొందిన భక్తులకు తిరుమలలో సిఫారసు లేఖల పై గదుల కేటాయింపును టీటీడీ రద్దు చేసినట్లు తెలుస్తోంది. తిరుపతిలోని విష్ణు నివాసం.. శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్ లో ఎస్ఎస్డీ టోకెన్లు జారీ చేస్తారు. భక్తులు ఆ సమయానికి చేరుకొని శ్రీవారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. అయితే, కొందరు ముందుగానే తిరుమలకు చేరుకొని గదులు పొందేందుకు సిఫారసు లేఖలు పొందుతున్నారు. వీరి సంఖ్య ఇటీవల పెరగటంతో ఇతర భక్తులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అదే విధంగా రూ 300 రూపాయల టికెట్లు పొందిన సుదూర ప్రాంతాల భక్తులకు మాత్రమే సిఫారసులపై గదులు ఇక ఇవ్వనున్నారు.

శ్రీవాణి టికెట్లు పొందన భక్తులు రెండు, మూడు గదులు పొందుతున్నట్లు గుర్తించారు. దీంతో, కుటుంబ సభ్యుల సంఖ్యకు అనుగుణంగా గదులు కేటాయించనున్నారు. అదే విధంగా భక్తుల క్యూ లైన్ల నిర్వహణ.. వేగంగా దర్శనం కోసం టీటీడీ మరి కొన్ని నిర్ణయాల దిశగా కసరత్తు చేస్తోంది. తాజాగా తిరుమలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆహార నాణ్యత పరీక్ష పరిశోధన శాలను టీటీడీ ఛైర్మన్ ప్రారంభించారు. గతంలో స్వామివారి ప్రసాదాలు, నెయ్యి లాంటి వస్తువుల నాణ్యతను పరీక్షించేందుకు ఇతర రాష్ట్రాలకు నమూనాలు పంపాల్సి వచ్చేదన్నారు. కానీ ఇప్పుడు తిరుమల లోనే అత్యాధునిక పరికరాలతో నేరుగా పరీక్షలు నిర్వహించగలిగే విధంగా ల్యాబ్‌ను తీర్చిదిద్దినట్లు ఛైర్మన్ చెప్పుకొచ్చారు. ఇకపై స్వామివారి ప్రసాదాల నాణ్యతను ఇదే ల్యాబ్‌లో పరిశీలించి వెంటనే ఫలితాలు అందించేలా ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications