అనూహ్య మలుపు తిరిగిన ప్రవచనకర్త చాగంటి-టీటీడీ వ్యవహారం
Chaganti Koteswara Rao: ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచన కర్త, ఏపీ ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు బ్రహ్మర్షి డాక్టర్ చాగంటి కోటేశ్వర రావుకు తిరుమలలో అవమానం జరిగిందని, ఆయన ప్రవచనాల కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం.. మరో మలుపు తిరిగింది. దీనిపై టీటీడీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
జరిగిందేంటీ?
ప్రతి సంవత్సరం జనవరిలో చాగంటి కోటేశ్వరరావు తిరుమల వచ్చి శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 14వ తేదీన శ్రీవారి దర్శనం, 16వ తేదీ సాయంత్రం తిరుపతి మహతి ఆడిటోరియంలో ప్రవచనాలు ఇవ్వడానికి ఆయన అంగీకరించారు. దీనికోసం కిందటి నెల 20వ తేదీన టీటీడీ అధికారులు ప్రొసిడింగ్స్ ఇచ్చారు.

ప్రొటోకాల్ ప్రివిలేజ్ ప్రకారం..
చాగంటి కోటేశ్వర రావు ప్రభుత్వ సలహాదారు కావడం, ఆయనకు కేబినేట్ ర్యాంక్ ఉండటం వల్ల ప్రొటోకాల్ ప్రివిలేజ్ ప్రకారం 14వ తేదీన శ్రీవారి దర్శనం ఏర్పాట్లను చేశారు టీటీడీ అధికారులు. ఇందులో భాగంగా ఆయన బస చేసిన రామ్ బగీచ గెస్ట్ హౌస్ నుండి శ్రీవారి ఆలయానికి ఆయనను తీసుకెళ్లడానికి బగ్గీ, శ్రీవారి ఆలయానికి బయోమెట్రిక్ ద్వారా అనుమతి ఇచ్చారు.
స్వయంగా వైకుంఠం కాంప్లెక్స్ నుంచి ఆలయానికి
వయసు రీత్యా శ్రీవారి ఆలయానికి బయోమెట్రిక్ ద్వారా వెళ్లే సదుపాయం ఉన్నప్పటికీ ఆయన దాన్ని సున్నితంగా తిరస్కరించారని టీటీడీ అధికారులు వివరించారు. పలువురు ప్రముఖులు, సాధారణ భక్తుల తరహాలోనే వైకుంఠం కాంప్లెక్స్ నుండి శ్రీవారి ఆలయానికి చేరాలని ఆయనే స్వయంగా సూచించారని, ఈ మేరకు స్వయంగా వైకుంఠం కాంప్లెక్స్ నుంచి ఆలయానికి చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారని పేర్కొన్నారు.
తోపులాట వల్ల..
అదే విధంగా ఈ నెల 8వ తేదీన తిరుపతిలో చోటు చేసుకున్న తోపులాటను దృష్టిలో పెట్టుకుని.. ప్రవచన కార్యక్రమాన్ని మరొక తేదీకి వాయిదా వేస్తే బాగుంటుందని ఆయనకు విజ్ఞప్తి చేశామని, దీనికి చాగంటి అంగీకరించారని టీటీడీ అధికారులు వివరించారు. ఆయన ఇచ్చే అపాయింట్మెంట్ తేదీలకు అనుగుణంగా మరోసారి ప్రవచన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
చట్టపరమైన చర్యలు
వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే బయోమెట్రిక్ ద్వారా కాకుండా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి శ్రీవారి ఆలయంలోకి అనుమతించారని, చివరి నిమిషంలో పరిపాలనా కారణాల వల్ల చాగంటి ప్రవచనాల కార్యక్రమాన్ని టీటీడీ రద్దు చేసినట్లు వార్తలు ప్రచారం చేయడం సరికాదని అన్నారు.
ముందే హెచ్చరిక..
వాస్తవాలను వక్రీకరించి అసత్యపు వార్తను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ అధికారులు హెచ్చరించారు. ఇప్పుడు దీనికి అనుగుణంగా చట్టపరమైన చర్యలకు దిగారు. తిరుపతి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు (నంబర్ 13/2025) నమోదు చేశారు.
ముగ్గురిపై..
డయల్ న్యూస్, పోస్ట్ 360, జర్నలిస్ట్ వైఎన్ఆర్..పై పోలీసులు కేసు నమోదు చేసినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. టీటీడీ ప్రతిష్ఠ దెబ్బతినేలా వాస్తవాలను వక్రీకరించి అవాస్తవాలను ప్రచారం చేశారని పేర్కొన్నారు. వారిపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయడంతో పాటు న్యూఢిల్లీ, విజయవాడలో గల ప్రెస్ ఇస్పర్మెషన్ బ్యూరో, లైసెన్స్ లను రద్దు చేయాలని యూట్యూబ్ మెటా మేనేజ్మెంట్‌కూ ఫిర్యాదు చేసినట్లు వివరించారు.












Click it and Unblock the Notifications