TTD: దర్శన టికెట్ల కేటాయింపులో కీలక మార్పులు, ఇక నుంచి ఇలా..!!
Tirumala: తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. కమాండ్ కంట్రోల్ ద్వారా భక్తుల క్యూ లైన్లను అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. రికార్డు స్థాయిలో దర్శనాలు జరుగుతున్నాయి. క్యూ లైన్లలో భక్తులకు వెసులుబాటు కలిగించేలా రీ ఎంట్రీ సదుపాయం అందుబాటులోకి తెచ్చారు. ఇక.. టీటీడీ దర్శన టికెట్ల పైన కీలక ప్రకటన చేసింది. కొత్త మార్పులు అమల్లోకి తెచ్చింది.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఇదే సమయంలో భక్తుల సౌకర్యార్థం శ్రీవాణి ట్రస్ట్‌కు సంబంధించిన దర్శన టికెట్ల కేటాయింపులో పలు మార్పులు చేస్తూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రోజుకు 1500 శ్రీవాణి టికెట్లను టీటీడీ ఆన్ లైన్ ద్వారా అందుబాటులో ఉంచడం జరిగింది. వీటిలో 500 దర్శన టికెట్లను మూడు నెలల ముందుగా ఆన్ లైన్ లో అడ్వాన్స్ బుకింగ్ కింద అందుబాటులో ఉంచుతున్నారు. అదేవిధంగా మరో 200 శ్రీవాణి దర్శన టికెట్లను తిరుపతి విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కింద జారీ చేస్తున్నారు. ప్రస్తుతం రోజువారీ కరెంట్ బుకింగ్ కోటాలో అందుబాటులో ఉన్న 800 శ్రీవాణి దర్శన టికెట్లలో ఇప్పటికే రూ.10 వేలు విరాళం చెల్లించి దర్శన టికెట్ కోసం వేచి ఉన్న దాతలకు ప్రతిరోజూ 300 టికెట్లు ప్రత్యేకంగా కేటాయించాలని నిర్ణయించారు. ఈ సదుపాయం 2025 మే 1 నుండి విరాళం చెల్లించిన అర్హులైన దాతలకు వర్తించనుంది.

భక్తులకు కీలక సూచనలు
ఈ టికెట్లు ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మధ్యాహ్నం 1 గంటలోపు బుక్ చేసుకున్న భక్తులకు అదే రోజు సాయంత్రం 4 గంటలకు దర్శనం కల్పించ నున్నారు. కాగా ఈ విధానం జూన్ 10వ తేది నుండి అమలులోకి రానుంది. ఈ కోటాలో బుకింగ్ కాని టికెట్లను తిరిగి కరెంట్ బుకింగ్ కోటాలో కలపబడతాయి. ఈ విధానం 2027 మార్చి 31 వరకు అమల్లో ఉంటుంది. అయితే.. ఏపీలో ఎంపిక చేసిన నాలుగు విమానాశ్రయాల్లోనూ శ్రీవాణి టికెట్ల ను ఆఫ్ లైన్ లో అందుబాటులో ఉంచాలని టీటీడీ భావిస్తోంది. ఈ మేరకు త్వరలోనే అధికారిక ప్రకటన చేయనుంది. విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, విశాఖ విమానాశ్రయాల్లో ఈ టికెట్లు అందుబాటులో ఉంచనున్నారు. ఇప్పటి వరకు రేణిగుంట విమానాశ్రయంలో మాత్రమే అందు బాటులో ఉన్న శ్రీవాణి టికెట్లు ఇక ఈ వినామాశ్రయాల్లోనూ భక్తులకు అందే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.













Click it and Unblock the Notifications