సరికొత్త రికార్డ్ నెలకొల్పిన తిరుమల
తిరుపతి: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవులు రావడంతో తిరుమలలో భక్తుల తాకిడి ఏర్పడింది. పరీక్షా ఫలితాలు వెల్లడి కావడం వల్ల స్వామివారికి మొక్కులు తీర్చుకునే వారి సంఖ్య కూడా దీనికి తోడయింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయాయి. అళ్వార్ ట్యాంక్ గెస్ట్ హౌస్ వరకు భక్తులు వేచి ఉంటోన్నారు. టోకెన్ లేని భక్తులకు స్వామివారి దర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోంది.
ఆదివారం 82,582 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 43,526 మంది తలనీలాలను సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం 3.19 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తోన్నారు. దీనికి అనుగుణంగా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటోన్నారు.

కిందటి నెలలో లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. హుండీ ద్వారా 114.12 కోట్ల రూపాయల మేర ఆదాయం అందింది. ప్రతినెలా తిరుమల తిరుపతి దేవస్థానానికి హుండీ ద్వారా అందే రెవెన్యూ మరోసారి 100 కోట్ల రూపాయలను దాటడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 100 కోట్ల రూపాయలకు పైగా హుండీ ఆదాయం రికార్డు కావడం వరుసగా ఇది 14వ నెల.
గత ఏడాది మార్చి నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు ప్రతినెల కూడా టీటీడీకి హుండీ ద్వారా అందిన ఆదాయం 100 కోట్ల రూపాయల పైమాటే. జులైలో అత్యధికంగా 139.45 కోట్ల రూపాయల ఆదాయం రికార్డయింది. హుండీ ద్వారా ఈ స్థాయిలో రెవెన్యూ రావడం తిరుమల చరిత్రలో అదే తొలిసారి. గత ఏడాది మార్చిలో 128 కోట్ల రూపాయలు, ఏప్రిల్‌లో 127.50 కోట్ల రూపాయలు, మేలో 130.50 కోట్ల రూపాయల హుండీ ఆదాయం రికార్డయింది.
జూన్‌లో కూడా 123.76 కోట్ల రూపాయలు అందాయి. జులైలో ఈ మొత్తం మరింత పెరిగింది. హుండీ రాబడి 140 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఇది సరికొత్త రికార్డును సృష్టించింది. ఇప్పుడు కూడా అదే స్పీడ్ కొనసాగుతోంది. ఏప్రిల్‌లో మళ్లీ 114 కోట్ల రూపాయలను మేర హుండీ కలెక్షన్లు నమోదయింది.












Click it and Unblock the Notifications