రూ.300 టికెట్లు లేకపోయినా శ్రీవారి దర్శనం- భక్తుల కోసం టీటీడీ కొత్త విధానం...!!
TTD: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. అటు వంట గ్యాస్ కష్టాలతో తిరుమలలో పెద్ద సంఖ్యలో హోటల్లు మూసేసారు. దీంతో, పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీవారి అన్న ప్రసాదానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. టీటీడీ వంట గ్యాస్ సరఫరాలో సమస్య రాకుండా అధికారులతో సంప్రదింపులు చేస్తోంది. ఇదే సమయంలో టీటీడీ శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు మంచి అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
తిరుమలలో భక్తుల కోసం టీటీడీ మరో వెసులు బాటు కల్పించింది. స్వామి వారిని దర్శించుకో వాలనునే భక్తుల కోసం టీటీడీ శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిర్వహిస్తోంది. ఈ హోమం టికెట్ రూ.1600 ఉంటుంది. ఇది తీసుకుంటే ఇద్దరు వ్యక్తులు హోమంలో పాల్గొన వచ్చు. అంతేకాకుండా హోమం పూర్తైన తర్వాత రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి ఉచితంగా వెళ్లవచ్చు. ప్రతీ నెలా ఈ హోమానికి సంబంధించిన టికెట్లను ఆన్‌లైన్‌లో టీటీడీ జారీ చేస్తోంది. ఈ టికెట్లను బుక్ చేసుకుంటే హోమంలో పాల్గొనడంతో పాటు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం ఉచితంగా లభిస్తుంది. ఈ టికెట్లను పొందినవారికి హోమం పూర్తైన తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుంచి స్వామివారి దర్శనం కల్పిస్తారు. రూ.300 దర్శనం టికెట్లు ఆన్‌లైన్‌లో దొరక్కపోతే ఈ విధానంలో స్వామివారిని దర్శించుకోవచ్చు. చాలామందికి ఈ విషయం తెలియక ఉపయోగిం చుకోలేకపోతున్నారు. దీంతో భక్తులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని టీటీడీ సూచిస్తోంది. ఈ హోమం అలిపిరి లోని సప్త గోప్రదక్షిణ శాలలో జరుగుతుంది.

తిరుమలలో శ్రీరామ నవమి ఆస్థానం
మార్చి 27న (శుక్రవారం) తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం వైభవంగా జరగనుంది. ఈ సందర్భంగా సాయంత్రం హనుమంత వాహన సేవ, రాత్రి 9-10 గంటల మధ్య బంగారు ప్రవేశ ద్వారం వద్ద ఆస్థానం నిర్వహిస్తారు. మరుసటి రోజు సీతారాముల పట్టాభిషేక ఆస్థానం ఉంటుంది. ఇది చైత్ర శుద్ధ నవమి నాడు జరుపుకునే ప్రధాన ఉత్సవం. కాగా, అటు ఒంటిమిట్టలో ఏప్రిల్ 1వ తేదీన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి టీటీడీ ఏర్పాట్లలో మునిగిపోయింది. అలాగే వార్షిక బ్రహ్మెత్సవాలకు భారీగా ఏర్పాట్లు చేస్తోంది. ఇటీవల ఏర్పాట్లను టీటీడీ జేఈవో వీరబ్రహ్మం పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. వేసవి కారణంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తాగునీటి సౌకర్యం కల్పించాలని సూచించారు.












Click it and Unblock the Notifications