తిరుమలలో పచ్చ తోరణం
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొంత తగ్గిం. బుధవారం నాడు 62,710 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 15,635 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.14 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో మూడు కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 8 నుంచి 10 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూలైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

కాగా- ఫిబ్రవరిలో తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే పర్వదినాలు, ఇతర విశేష ఉత్సవాలకు సంబంధించిన వివరాలను టీటీడీ అధికారులు విడుదల చేశారు. 2వ తేదీన వసంత పంచమితో ఈ ఉత్సవాలు ఆరంభమౌతాయి. 26వ తేదీన మహా శివరాత్రితో ముగుస్తాయి.
ఫిబ్రవరి 4వ తేదీన రథ సప్తమి పర్వదినాన్ని వైభవంగా నిర్వహించడానికి టీటీడీ అధికారులు సన్నాహాలు చేపట్టారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి సీహెచ్ వెంకయ్య చౌదరి ఇప్పటికే సమీక్ష సైతం నిర్వహించారు. టీటీడీ వివిధ విభాగాల అధికారులు, విజిలెన్స్, సెక్యూరిటీ, పోలీసులతో సమన్వయం చేసుకుని ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
భక్తుల రద్దీని ముందుగానే అంచన వేయాలని, దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ట్రాఫిక్, పార్కింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. సమగ్ర బందోబస్తుపై ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని, ఘాట్ రోడ్డు వాహనాల రాకపోకలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని వెంకయ్య చౌదరి చెప్పారు.
5వ తేదీన- భీష్మాష్టమి పర్వదినాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు టీటీడీ అధికారులు. 6న మధ్వ నవమి, 8న భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారికి విశేష ఉత్సవాలను జరుపుతారు. 12న శ్రీ రామకృష్ణతీర్థ ముక్కోటి, అదే రోజున మాఘ పూర్ణిమ వేడుకలను చేపడతారు. 24వ తేదీన సర్వ ఏకాదశి, 26న మహాశివరాత్రి పండగను కన్నులపండుగా నిర్వహించనున్నారు.












Click it and Unblock the Notifications