భక్తులకు గమనిక... డిసెంబర్ 19న తిరుమల స్వామి వారి దర్శనం నిలిపివేత..
తిరుమల వెళ్లే భక్తులకు ఓ ముఖ్య గమనిక. డిసెంబర్ 19న స్వామి వారి దర్శనాన్ని నిలిపివేస్తూ టీటీడి కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 19న ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా స్వామి వారి ఆలయంలో మంగళవారం నాడు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ప్రతి ఏటా నాలుగు సార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఒక పరిపాటిగా మారింది. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం రోజున ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ.
ఉదయం 6 నుంచి 11 గంటల వరకు దర్శనం నిలిపివేత : ఈ సందర్భంగా డిసెంబరు 19న 5 గంటల పాటు స్వామివారి దర్శానాన్ని నిలిపివేస్తున్నారు. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు ఆలయ శుద్ధి కార్యక్రమాన్నిఅర్చకులు నిర్వహిస్తారు. ఆనంద నిలయం నుంచి ప్రారంభించి బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రం చేస్తారు. ఈ ఆలయాన్ని శుభ్రం చేసే సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పడం జరుగుతుంది. ఆలయ శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ వంటి సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా జల్లుతారు.

పదిరోజుల పాటు వైకుంఠ ద్వారా దర్శనం : అనంతరం స్వామి వారి మూల విరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను చేపడతారు. ఆ తర్వాత భక్తులను అనుమతించడం జరుగుతుంది. అప్పటి వరకు స్వామి వారి దర్శనం ఉండదు. ఈ కారణంగా ఆలయంలో అష్టదళ పాదపద్మారాధన సేవను కూడా టీటీడి రద్దు చేసింది. కావున డిసెంబర్ 19న స్వామి వారిని దర్శించుకోవాలనుకునే భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. తిరుమలలో పదిరోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనాన్ని కటీటీడి కల్పిస్తోంది. ఇది డిసెంబర్ 23 నుంచి జనవరి 1 వరకు ఉంటుంది. దీనికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం పలు కీలక నిర్ణయాలను కూడా తీసుకుంది. ఇప్పటికే వైకుంఠ దర్శనానికి సంబంధించిన రూ.300 టికెట్లను ఆన్లైన్లో విడుదల చేసింది. ఇక, ఆఫ్‌లైన్ టికెట్లను డిసెంబర్ 22న తిరుపతిలోని కౌంటర్లలో కోనుగోలు చేయొచ్చు.












Click it and Unblock the Notifications