TTD: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న భక్తుల సంఖ్య ఎంతంటే!!
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి దేవస్థానంలో డిసెంబర్ 23 నుంచి వైకుంఠ ద్వారాలను టిటిడి తెరిచి వెంకన్న భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించింది. వైకుంఠ ద్వారం గుండా గత పది రోజులుగా పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
ఇక ఈ క్రమంలో వైకుంఠ ద్వారాల గుండా స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్యను, హుండీ ఆదాయ వివరాలను టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ తిరుమలలో వైకుంఠద్వార దర్శనానికి 7,76,930 టిక్కెట్లు, టోకన్లు జారీ చేసినట్టు ఆయన పేర్కొన్నారు.

తిరుమలకు వచ్చిన భక్తులందరూ శ్రీవారిని దర్శించుకున్నట్లు టిటిడి ఈఓ ఎ.వి. ధర్మారెడ్డి తెలిపారు. గతేడాది 6 లక్షల 9 వేల మంది భక్తులు వైకుంఠద్వార దర్శనం చేసుకుంటే.. ఈ ఏడాది 6,47,452 మంది భక్తులు స్వామిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం చేసుకున్నారన్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది 40 వేల మంది భక్తులు అదనంగా స్వామివారిని దర్శించుకున్నారు అని ఆయన తెలిపారు.
అత్యధికంగా రికార్డ్ స్థాయిలో 40.20 కోట్లు హుండీ కానుకలు వచ్చాయన్నారు. 35.60 లక్షల లడ్డూలు భక్తులకు విక్రయించామని..2.13 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారని టిటిడి ఈవో ఏ.వి ధర్మారెడ్డి లెక్కలు చెప్పారు. ఆబ్సెంటీస్ పూరించేందుకు టీటీడీ ఎంప్లాయిస్ రెఫరల్స్, పాలకమండలి సిఫార్సులపై 67 వేల రూ300 టిక్కెట్లు అందజేసామని ఆయన వెల్లడించారు. మొత్తం మీద పదిరోజులకు 39 వేల మంది అబ్సెంటీస్ నమోదయ్యాయన్నారు.
వచ్చే యేడాది వైకుంఠద్వార దర్శనానికి అబ్సెంటీస్ తగ్గించేందుకు ప్రయత్నిస్తామన్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకుంటే సకల పాపాలు పోతాయని భక్తుల విశేషమైన నమ్మకం. ఈ క్రమంలోనే లక్షల సంఖ్యలో భక్తులు వైకుంఠ ద్వార దర్శనానికి తిరుమలకు పోటెత్తారు. స్వామిని దర్శించుకుని తరించారు.












Click it and Unblock the Notifications