TTD: తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు.. పుష్కరిణిలో మలయప్పస్వామి శోభ!!
కలియుగ ప్రత్యక్ష దైవం, సాక్షాత్తు ఏడుకొండల పైన కొలువుతీరిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సాలకట్ల తెప్పోత్సవాలు ఈ నెలలో జరగనున్నాయి. మార్చి 20వ తేదీ నుండి 24వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు శ్రీవారి తో పాటు అమ్మవారు రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు పుష్కరిణిలో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇస్తారు.
శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల్లో భాగంగా తొలి రోజు మార్చి 20 తేదీన శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి అవతారంలో తెప్పలపై పుష్కరిణిలో స్వామి వారు విహరించనున్నారు. పుష్కరిణిలో మూడు చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేయనున్నారు. తరువాత మార్చి 21వ తేదీన రెండవ రోజు రుక్మిణి సమేతంగా శ్రీకృష్ణ స్వామి అవతారంలో పుష్కరిణిలో మూడు రౌండ్లు తెప్పలపై విహరించి భక్తులను కరుణించనున్నారు.

మూడవరోజు మార్చి 22వ తేదీన శ్రీ భూదేవి సమేతంగా మలయప్ప స్వామి వారు మూడుసార్లు పుష్కరిణిలో విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు. ఆపై నాలుగవ రోజు మార్చి 23వ తేదీన శ్రీ మలయప్ప స్వామి వారు ఐదు సార్లు తెప్పలపై పుష్కరిణిలో ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఇక చివరి రోజు మార్చి 24వ తేదీన మలయప్ప స్వామి ఏడు సార్లు తెప్పపై పుష్కరిణిలో విహరించి భక్తులను కటాక్షిస్తారు. ఇక స్వామివారి సాలకట్ల తెప్పోత్సవాల సందర్భంగా మార్చి 20, 21వ తేదీలలో సహస్ర దీపాలంకార సేవ, మార్చి 22, 23, 24 తేదీలలో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.
ఇదిలా ఉంటే నిన్న తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 63, 831 మంది మంది. వీరిలో తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 25,367 మంది. స్వామివారికి నిన్న ఒక్కరోజే వచ్చిన హుండీ ఆదాయం 3.36 కోట్లు. ఇక నిన్న 15 వెయిటింగ్ కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనానికి వేచి ఉన్నారు. ప్రస్తుతం తిరుమల శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతుందని టిటిడి వెల్లడించింది.












Click it and Unblock the Notifications