రాజధాని అమరావతి గ్రామాల్లో పండగ కోలాహలం
Tirumala: అమరావతిలోని శ్రీవారి ఆలయంలో ఈ నెల 15వ తేదీన శ్రీనివాస కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. అ ఉత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పలువురు మంత్రులు హాజరు కానున్నారు.
2018లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఆలయ నిర్మాణానికి వెంకటపాలెంలో 25 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. 2019లో శంకుస్థాపన చేశారు. ఆ తరువాత వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆలయాన్ని నిర్మించింది. 2022లో వైభవంగా ప్రారంభించింది. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించింది.

శ్రీనివాస కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకుంది. టీటీడీ కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు అమరావతిలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాదాపు 25,000 మందికి పైగా భక్తులు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని, దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అన్నారు.
భక్తులు శ్రీవారి కల్యాణాన్ని వీక్షించడానికి వీలుగా ఎల్ఈడీ స్కీన్లను ఏర్పాటు చేస్తున్నామని శ్యామలరావు అన్నారు. మంచినీరు, మజ్జిగ, అన్న ప్రసాదాలు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా రాజధాని అమరావతి ప్రాంతంలో శ్రీవారి ధర్మ రథాలతో ప్రచారం చేస్తున్నామని వివరించారు.
టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భక్తి సంగీత, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని, దీన్ని ఎస్వీబీసీ ఛానల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, దేవాదాయ శాఖ కార్యదర్శి వినయ్ చంద్, జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, దేవాదాయ శాఖ ఇంఛార్జి కమిషనర్ రామచంద్ర మోహన్, జాయింట్ కలెక్టర్ భార్గవతేజ, ఎస్పీ సతీష్ కుమార్ పాల్గొన్నారు.
అనంతరం ఈవో.. శ్రీనివాస కళ్యాణం ఏర్పాట్లపై ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తులకు ప్రవేశం, నిష్క్రమణ మార్గాలు, క్యూలైన్లను సౌకర్యవంతంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
శ్రీనివాస కళ్యాణోత్సవంకు సంబంధించి ఆయా గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించడానికి ఉద్దేశించిన శ్రీవారి ధర్మ రథాలను శ్యామల రావు జెండాను ఊపి ప్రారంభించారు. పోస్టర్లను ఆవిష్కరించారు. అమరావతి గ్రామాల్లో ధర్మ రథాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు.












Click it and Unblock the Notifications