గుడ్ న్యూస్- శ్రీవారి భక్తులను ఆహ్వానించిన టీటీడీ
Tirumala Metlotsavam: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం నాడు 71,110 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 25,695 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 4.89 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 20 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 12 నుండి 14 గంటల సమయం పట్టింది. కంపార్ట్ మెంట్లు, క్యూలైన్లల్లో ఉన్న భక్తులకు టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అన్నప్రసాదాలను పంపిణీ చేాశారు.

టీటీడీ- దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేది నుండి నవంబర్ 1వ తేదీ వరకు తిరుమల ఆస్థాన మండపంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం ఘనంగా జరుగనుంది. 30, 31వ తేదీల‌్లో మధ్యాహ్నం ఒంటిగంట నుండి సాయంత్రం 4 గంటల వరకు భజన మండళ్లతో నామ సంకీర్తన, సామూహిక భజన, ధార్మిక సందేశాలు, మహనీయులు మానవాళికి అందించిన ఉపదేశాలు తెలియజేస్తారు.
సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు సంగీత విభావరి, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. నవంబర్ 1వ తేదీన ఉదయం 8:30 గంటలకు సామూహిక నామ సంకీర్తన వినిపిస్తారు. ఉదయం 9:30 గంటల నుండి స్వామిజీలు ధార్మిక సందేశం ఇవ్వనున్నారు.
అక్టోబర్ 31వ తేదీ ఉదయం 4.30 గంటలకు అలిపిరి పాదాల మండపం వద్ద మెట్లపూజ నిర్వహిస్తారు. అనంతరం వేల సంఖ్యలో వచ్చే భజన మండలి సభ్యులతో సాంప్రదాయ భజనలు చేస్తూ సప్తగిరీశుని చెంతకు చేరుకుంటారు.
ఎందరో మహర్షులు, రాజర్షులు పురందరదాసుడు, వ్యాసరాజయతీశ్వరులు, అన్నమాచార్యులు, శ్రీకృష్ణదేవరాయలు లాంటి మహనీయులు భక్తిప్రపత్తులతో వేంకటాద్రి పర్వతాన్ని ఎక్కి అధిరోహించి ధన్యులయ్యారని, అలాంటివారి అడుగుజాడల్లో నడిచి ఆ దేవదేవుని కృపకు అందరూ పాత్రులు కావాలనే ఉన్నతాశయంతో మెట్లోత్సవ కార్యక్రమాన్ని చేపట్టినట్లు దాస సాహిత్య ప్రాజెక్టు తెలిపింది.












Click it and Unblock the Notifications