దర్శన టికెట్ల జారీలో TTD కీలక మార్పులు, 10వ తేదీ నుంచి అమలు..!!
TTD: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గత కొద్ది నెలల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ తగ్గడం లేదు. వేసవి రద్దీ ఇంకా తిరుమలలో కొనసాగుతూనే ఉంది. ఈ నెల రెండో వారం నుంచి విద్యాసంస్థలు ప్రారంభం కానుండటంతో ముందుగానే శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు వేలాది మంది భక్తులు తిరుమలకు ప్రతిరోజూ చేరుకుంటున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. ఇదే సమయంలో ఈ నెల 10వ తేదీ నుంచి శ్రీవాణి టికెట్ల జారీలో కొత్త విధానం అమలు కానుంది.
శ్రీవాణి టికెట్ల జారీ పై టీటీడీ కొత్త విధానం అమలు చేయనుంది. ప్రస్తుతం ప్రతిరోజూ జారీ చేసే 1,500 శ్రీవాణి టికెట్ల కోటాను విభజించింది. భక్తులు తమ పర్యటనను ముందే ప్లాన్ చేసుకునేలా 500 టికెట్లను మూడు నెలల ముందే ఆన్‌లైన్‌లో అడ్వాన్స్ బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. విమాన ప్రయాణికుల కోసం తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో రోజువారీ కరెంట్ బుకింగ్ కింద 200 టికెట్లను యథావిధిగా కేటాయిస్తోంది. మిగిలిన రోజువారీ కోటాలో విరాళం ఇచ్చి దర్శనం కోసం వేచి చూస్తున్న దాదాపు 41 వేల మంది బ్యాక్‌లాగ్ దాతల కోసం ప్రత్యేకంగా రోజూ 300 టికెట్లను కేటాయించాలని నిర్ణయించింది. ఈ కొత్త నిబంధనలు జూన్ 10 నుండి అమల్లోకి రానున్నాయి.

విమానాశ్రయాల్లోనూ శ్రీవాణి కోటా టికెట్లు
అదే విధంగా ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు విడుదలయ్యే ఈ టికెట్లను మధ్యాహ్నం 1 గంటలోపు బుక్ చేసుకుంటే, అదే రోజు సాయంత్రం 4 గంటలకు స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. ఈ ప్రత్యేక కోటా టికెట్లు మిగిలిపోతే వాటిని కరెంట్ బుకింగ్‌కు బదిలీ చేస్తారు. ఈ విధానం వచ్చే ఏడాది మార్చి 31 వరకు అమల్లో ఉంటుంది. భవిష్యత్తులో శ్రీవాణి దర్శన టికెట్ల జారీ కోసం లక్కీడిప్ విధానాన్ని తీసుకురావడంతో పాటు విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి విమానాశ్రయాల్లోనూ కౌంటర్లు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇక.. భక్తుల రద్దీ పెరుగుతుండటంతో .. వారి కోసం శాశ్వత క్యూ లైన్ నిర్మాణానికి టీటీడీ సిద్దం అవుతోంది. ఈ మేరకు వచ్చే బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా ఎన్నారై కోటా దర్శన సమయం 90 రోజులకు పెంచుతూ నిర్ణయించారు.













Click it and Unblock the Notifications