TTD: వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు ఇలా పొందండి- ఏ రోజు ఎన్ని..!!
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. భక్తుల సౌకర్యాలు పెంచేందుకు టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా కొత్త ప్రతిపాదనల పైన కసరత్తు చేస్తోంది. ఈ ఏడాది వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని నిర్ణయించింది. కాగా, రూ 300 టికెట్ల జారీ తేదీలు.. ఏ విధంగా పొందాలో టీటీడీ వెల్లడించింది. ఈసారి సామాన్య భక్తులకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది.
తిరుమలలో డిసెంబర్ 30వ తేదీ నుంచి వచ్చే ఏడాది జనవరి 8వ తేదీ వరకు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని భక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చని ప్రకటించింది. పది రోజుల దర్శన కాలంలో మొత్తం 182 గంటల సమయం ఉండగా, అందులో 164 గంటలను సాధారణ భక్తులకే కేటాయించారు. వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమయ్యే మొదటి మూడు రోజులు (డిసెంబర్ 30, 31, జనవరి 1) రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి దర్శనాలను పూర్తిగా రద్దు చేశారు. కాగా, రూ 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను డిసెంబర్ 5న టీటీడీ విడుదల చేయనుంది. జనవరి 2 నుంచి 8 వరకు రోజుకు 15 వేల టికెట్ల చొప్పున కేటాయించాలని తాజాగా నిర్ణయం తీసుకున్నారు. 5వ తేదీ మధ్నాహ్నం 3 గంటలకు వీటిని ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు.

ఇక, తొలి మూడు రోజులకు (వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, న్యూ ఇయర్) కు సంబంధించిన ఉచిత ద్వార దర్శనం టోకెన్ల కోసం ఈ నెల 27 నుంచి డిసెంబర్ 1 వరకు రిజిస్ట్రేషన్ చేసకోవాలని సూచించారు. డిసెంబర్ 2న ఈ డిప్ ద్వారా దర్శనాలను కేటాయిస్తారు. తొలి మూడు రోజులే దర్శనాలకు రద్దీ ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆ మూడు రోజులకు దాదాపు 2.13 లక్షల మందికి టోకెన్లు కేటాయించేలా టీటీడీ ప్రణాళికలు సిద్దం చేసింది. జనవరి 2 నుంచి ఏడు రోజులు సర్వదర్శన భక్తులు నేరుగా తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకోవచ్చు. ఇక.. ఈ నెల 27న అమరావతి లోని శ్రీవారి ఆలయంలో కీలక ఘట్టం చోటు చేసుకోనుంది. అదే రోజు సీఎం చంద్రబాబు టీటీడీ పైన సమీక్ష చేయనున్నారు. వైకుంఠ ఏకాదశి నిర్వహణ పైన సీఎం కీలక సూచనలు చేసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications