TTD: శ్రీవారి రెండు నెలల రూ.300 దర్శన టికెట్లు- వసతి కోటా విడుదల..!!
Tirumala: తిరుమల భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లను బుక్ చేసుకునే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా టిటిడి ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. అందులో భాగంగా జూలై, ఆగస్టు నెలల రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను రేపు (24వ తేదీ) ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. అదే విధంగా తిరుపతిలో గదుల కోటాను 25న, తిరుమలలో గదుల కోటాను 26న విడుదల చేయనున్నారు.
టీటీడీ కీలక నిర్ణయాలు : టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. పెరుగుతున్న భక్తుల రద్దీ కారణంగా ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ మేరకు ఆన్ లైన్ లో టికెట్ల విడుదల తేదీలను ప్రకటించింది. రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లకు సంబంధించిన జూలై, ఆగస్టు నెలల కోటాను మే 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది.

టీటీడీ వెబ్‌సైట్ https://tirupatibalaji.ap.gov.in లో దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. అదే విధంగా యాప్ ద్వారా బుక్ చేసుకొనే అవకాశం ఉంది. తిరుపతిలో గదుల కోటాను 25న, తిరుమలలో గదుల కోటాను 26న విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే ఈ రెండు నెలల సేవలకు సంబంధించి టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేసారు.
విఐపి దర్శనాల్లో మార్పులు : వేసవిలో పెరుగుతున్న భక్తుల రద్దీ కారణంగా తాజాగా ఆర్జితసేవలు, విఐపి దర్శనాల్లో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సామాన్యభక్తుల సౌలభ్యం కోసం జూన్ 30వ తేదీ వరకు స్వామివారి సేవలు, విఐపి దర్శనాల్లో స్వల్ప మార్పులు చేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది. శుక్ర, శని, ఆదివారాల్లో సుప్రభాత సేవకు విచక్షణ కోటాను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
దీని ద్వారా 20 నిమిషాల సమయం ఆదా అవుతుందని అంచనా వేసారు. గురువారం తిరుప్పావడ సేవ ఏకాంతంగా నిర్వహించడం జరుగుతుంది. తద్వారా 30 నిమిషాల సమయం ఆదా అవుతుందని అధికారులు చెబుతున్నారు. శుక్ర, శని, ఆదివారాల్లో విఐపి దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించకూడదని నిర్ణయించారు. కేవలం స్వయంగా వచ్చే వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనం కల్పించనున్నారు.

షెడ్యూల్ విడుదల : వీఐపీ దర్శనాలను నియంత్రించటం ద్వారా ప్రతీ రోజు మూడు గంటల వరకు సమయం ఆదా అవుతుందని అధికారులు భావిస్తున్నారు. క్యూ లైన్లలో గంటల తరబడి కిలోమీటర్ల మేర వేచి ఉండే వేలాది మంది సామాన్య భక్తులకు ఈ నిర్ణయాల వల్ల త్వరితగతిన స్వామివారి దర్శనం అవుతుందని చెబుతున్నారు.
ఇక ప్రతినెలా 18 నుంచి 20వ తేదీ వరకు సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన ఆర్జిత సేవల లక్కీ డిప్ కోసం నమోదు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. 20 నుంచి 22వ తేదీ వరకు డిప్ లో టికెట్లు పొందిన వాళ్లు సొమ్ము చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతీ నెల 21వ తేదీన కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవలతోపాటు వర్చువల్ సేవాటికెట్లను విడుదల చేస్తారు.












Click it and Unblock the Notifications