"పెద్ద పెద్ద పీఠాలు కదులుతాయ్..!"- ఒకర్ని హీరో చేయడం వల్లే- దిప్కే కామెంట్స్..!
నీట్ సహా జాతీయ స్థాయి పరీక్షల్లో అక్రమాలకు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ నిరసనలు చేపట్టి తమ డిమాండ్ విషయంలో ఎట్టకేలకు విజయం సాధించిన కాక్రోచ్ జనతా పార్టీ బాస్ అభిజీత్ దిప్కే (Abhijeet Dipke) ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత జంతర్ మంతర్ లో జరిగిన సంబరాల్లో పాల్గొని నీట్ మృతులకు నివాళి అర్పించిన అనంతరం దిప్కే మీడియాతో మాట్లాడారు. ఇందులో ఆయన హిందూ-ముస్లిం రాజకీయాలు వదిలేస్తే పెద్ద పెద్ద పీఠాలు కదులుతాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
హిందూ-ముస్లిం రాజకీయాలకు బదులుగా ప్రజా సమస్యలపై దృష్టి సారించే 'అంశాల ఆధారిత రాజకీయాలు' శక్తివంతమైన రాజకీయ వ్యవస్థలను కదిలిస్తాయని, తద్వారా దేశానికి మేలు జరుగుతుందని కాక్రోచ్ జనతా పార్టీ అధినేత అభిజీత్ దిప్కే పేర్కొన్నారు. అలాగే ఇవాళ తాను ఓ ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నానని దిప్కే తెలిపారు. ధర్మేంద్ర ప్రధాన్ ఈ రోజు రాజీనామా చేసినంత మాత్రాన తనను హీరోని చేయొద్దన్నారు. ఈ పొరపాటు చేయవద్దన్నారు. ఒక వ్యక్తిని హీరోని చేయడం వల్లే దేశం నాశనమైందన్నారు.

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత తమ రెండు ఇతర డిమాండ్లు అయిన నీట్ లీక్ కారణంగా చనిపోయిన విద్యార్ధులకు కోటి పరిహారం, ఢిల్లీ మార్చ్ లో విద్యార్దులపై పెట్టిన కేసుల తొలగింపుపై పట్టుబడుతున్న కాక్రోచ్ లు తమ ఆందోళనలు ముమ్మరం చేయబోతున్నారు. ఇందులో భాగంగానే దిప్కే నోట కొత్త కొత్త అంశాలపై వ్యాఖ్యలు వెలువడుతున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ కాక్రోచ్ లు ఇతర అంశాలపైనా ఫోకస్ పెడితే దేశవ్యాప్తంగా వారికి ఇదే మద్దతు కొనసాగుతుందా లేదా అనే దానిపైనా చర్చలు జరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications