భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభానికి కౌంట్ డౌన్ .. మొదలైన సంబరం!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం త్వరలో ప్రారంభం కాబోతుంది. ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలుస్తుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. భూమి నుండి భవిష్యత్తు వరకు అనే పేరుతో నిర్వహించిన ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మంత్రి విజయనగరం కోట వద్ద నుండి విమానాశ్రయం వరకు భారీ వాహన ర్యాలీని ప్రారంభించారు.
భోగాపురం ఎయిర్పోర్ట్ తో స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్రకు గ్రోత్ ఇంజిన్ గా మారుతుందని పేర్కొన్నారు. విమానాశ్రయం ప్రారంభంతో స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. వర్తక వ్యాపారాలు, పారిశ్రామిక ప్రగతి ఈ ఎయిర్పోర్టు ఏర్పాటుతో జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

డిజిటల్ టైమర్ వాల్ ను ఆవిష్కరించి కార్యక్రమం
ఎయిర్పోర్ట్ ప్రారంభానికి సంబంధించిన కౌంట్ డౌన్ చూపిస్తూ డిజిటల్ టైమర్ వాల్ ను ఆవిష్కరించారు. అక్కడ ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్లో ఉత్సాహంగా ఫోటోలు దిగారు. అధికారులు ప్రజాప్రతినిధులు ప్లెడ్జ్ వాల్ పైన సంతకాలు చేశారు. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల. ఇది ప్రారంభమైతే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు మెరుగైన విమాన సౌకర్యం లభిస్తుంది.
భారీ వాహన ర్యాలీతో భోగాపురం ఎయిర్పోర్ట్ కు
ఈ విమానాశ్రయాన్ని ఏపీ సర్కార్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పూర్తి చేయడంతో, దీనికి కావలసినంత ప్రచారాన్ని కల్పించనున్నారు. ఈ క్రమంలోనే నిర్వహించిన కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు భారీ వాహన ర్యాలీతో భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు వెళ్లి హడావిడి చేశారు. ఏది ఏమైనా ఉత్తరాంధ్ర ప్రజలకు వరప్రదాయినిగా, ఆ ప్రాంత అభివృద్ధికి కీలకంగా భోగాపురం ఎయిర్పోర్ట్ మారనుంది.
మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు కృషి ఫలితం
ఈ ఎయిర్పోర్టును అంతర్జాతీయంగా తీర్చిదిద్దడానికి ఏవియేషన్ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు చొరవ తీసుకున్నారు. నిరంతరం భోగాపురం విమానాశ్రయ పనులను పరిశీలించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఫలితంగా భోగాపురం ఎయిర్పోర్ట్ ఈ ప్రాంత ప్రజలకు కల్పతరువుగా మారి ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలక పాత్ర పోషించనుంది.












Click it and Unblock the Notifications