పశ్చిమ రాయలసీమ ఫలితంపై టెన్షన్-టీడీపీ నేతల హౌస్ అరెస్టులు-పోలీసుల హెచ్చరికలు
పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఇవాళ రాత్రికి కానీ, రేపు ఉదయానికి కానీ వెల్లడయ్యే అవకాశం ఉంది.
అనంతపురం : పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్దానానికి జరిగిన ఎమ్మెల్సీ పోరులో వైసీపీ, టీడీపీ అభ్యర్ధులు హోరాహోరీ పోరాడుతున్నారు. మొన్న ప్రారంభమైన కౌంటింగ్ ఇవాళ కూడా కొనసాగుతోంది. ఈ కౌంటింగ్ లో వైసీపీ అభ్యర్ధి వెన్నపూస రవీంద్రారెడ్డి, టీడీపీ అభ్యర్ధి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. వీరిద్దరికీ లభిస్తున్న ఓట్ల తేడా చాలా స్పల్పంగా ఉన్న నేపథ్యంలో ఫలితాలపై ఉత్కంఠ అంతకంతకూ పెరుగుతోంది.
మరోవైపు ఇప్పటికే తొలి ప్రాధాన్య ఓటు లెక్కింపు పూర్తయి, రెండో ప్రాధాన్యత ఓటు వరకూ కౌంటింగ్ వచ్చింది. అయితే ఇందులోనూ ఎలిమినేషన్ ప్రక్రియలో ఒక్కో అభ్యర్ధి ఎలిమినేట్ అయ్యే కొద్దీ వైసీపీ అభ్యర్ధి రవీంద్రారెడ్డి మెజారిటీ తగ్గుతుంటడం, టీడీపీ అభ్యర్ధి రాంగోపాల్ రెడ్డి మెజారిటీ పెరుగుతుండటంతో టెన్షన్ కూడా అదే స్ధాయిలో పెరుగుతోంది. ఫలితం ఎవరివైపు అయినా మొగ్గే అవకాశం ఉండటంతో పాటు ఫేక్ న్యూస్ ప్రచారం కూడా తారా స్దాయిలో సాగుతోంది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

అనంతపురం JNTU లో మూడవ రోజు కొనసాగుతోన్న కడప-అనంతపురము-కర్నూలు పట్టభద్ర ఎమ్మెల్సీ కౌంటింగు విషయంలో పుకార్లు, ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తే చర్యలు తప్పవని ఎస్పీ ఫకీరప్ప హెచ్చరించారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తీ అయ్యి ఫలితాలు వెల్లడయ్యేందుకు ఇంకా చాలా సమయం పట్టే అవకాశముందని ఆయన తెలిపారు. అందరూ సంయమనంతో ఉండాలిని, వాస్తవాలు కాకుండా పుకార్లు వ్యాప్తి చేయడం వల్ల అలజడులు చెలరేగే వీలుందని గమనించాలన్నారు. కౌంటింగు యావత్తు ఎన్నికల నియమ నిబంధనల ప్రకారమే నిర్వహిస్తారని, ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తే చర్యలు తప్పవన్నారు. మరోవైపు అనంతపురం పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా కాల్వశ్రీనివాసులు సహా పలువురు టీడీపీ నేతల్ని హౌస్ అరెస్టు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications