T & Mకి TDP ఆహ్వానం?
తెలుగుదేశం పార్టీ తన ఖమ్మం బహిరంగసభలో తెలంగాణ అధికార పార్టీ భారత రాష్ట్ర సమితిపై కనీస విమర్శ కూడా చేయలేదు. రెండు రాష్ట్రాలు కలవాలంటున్న వైసీపీ విధానాలను చంద్రబాబు తూర్పారబట్టారు కానీ కేసీఆర్ విధానాలపై పల్లెత్తు మాట అనకపోవడం వెనక రాజకీయ వ్యూహం దిగివుంటుందనే అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. కేవలం తన హయాంలో జరిగిన అభివృద్ధినే చంద్రబాబు ప్రస్తావించారు.

ఎక్కువ నష్టపోయేది బీఆర్ఎస్సే?
తెలుగుదేశం పార్టీ తెలంగాణలో యాక్టివ్ అయితే ఎక్కువ గా నష్టపోయేది బీఆర్ఎస్. దీంతో ఆ పార్టీ నేతలు రంగంలోకి దిగి చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు. పార్టీని వీడినవారంతా తిరిగి రావాలంటూ చంద్రబాబు పిలుపునివ్వడంతో రాజకీయ పరిణామాలు ఎటువంటి మలుపు తిరుగుతాయో అనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది. తెలుగుదేశం పార్టీ పుట్టిందే తెలంగాణలో అనే విషయాన్ని నాయకులంతా గమనంలో ఉంచుకోవాలని బాబు గుర్తుచేశారు. ఖమ్మంలో విజయశంఖారావం పూరించడం వెనక అనేక రాజకీయ వ్యూహాలు దాగివున్నాయి.

పునరాలోచనలో పడ్డ తుమ్మల?
ఖమ్మం జిల్లాలో కీలక నేతగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తుతం సైలెంటయ్యారు. బీఆర్ఎస్ లో ఉన్నప్పటికీ చురుగ్గా రాజకీయ కార్యకలాపాలు చేయడంలేదు. ఇటీవలే ఆయన తన అనుచరులతో సమాలోచనలు జరిపారు. అప్పుడే ఆయన పార్టీ మారబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆయన టీడీపీలోకి వస్తారా? అనే చర్చ నడుస్తోంది. 2016లో పాలేరుకు జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచిన తుమ్మల మంత్రి పదవులు చేపట్టారు. 2018లో ఓడిపోవడంవల్ల గ్రూపు రాజకీయాలు పెరిగాయి. మొదట్లో ప్రాధాన్యత కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత తుమ్మల నాగేశ్వరరావు ప్రాధాన్యత తగ్గించారు. పాలేరులో గెలిచిన కందాల ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్ లోకి రావడంలో ఆయనకు కష్టాలు ప్రారంభమయ్యాయి. రానున్న ఎన్నికల్లో పాలేరు నుంచి సీటిస్తారనే నమ్మకం కూడా కలగడంలేదు. అధికార పార్టీపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. రాష్ట్రంలో టీడీపీ క్రియాశీలమైన నేపథ్యంలో తుమ్మల పునరాలోచనలో పడ్డారంటున్నారు.

మండవ వెంకటేశ్వరరావు పచ్చకండువా కప్పుకుంటారా?
తెలుగుదేశం పార్టీ తదుపరి సభ నిజామాబాద్ లో ఉంటుందని పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ చూసినా సెటిలర్లు కనిపిస్తారు. ఈ జిల్లాకు చెందిన కీలక నేత, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఉన్నారు. 2014 తర్వాత రాజకీయాలకు దూరం జరిగిన మండవను కేసీఆర్ స్వయంగా కలిసి తన పార్టీలో చేర్చుకున్నారు. తన కుమార్తె కవిత ఎంపీగా పోటీచేయబోతోంది కాబట్టి మండవను ఆహ్వానించారని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఆ తర్వాతఎందుకనో కేసీఆర్ మండవ విషయంలో నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించారని ఆయన అనుచరులు చెబుతుంటారు. దీంతో వెంకటేశ్వరరావు కూడా కూడా జరుగుతున్న పరిణామాలను బేరీజు వేసుకొని తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications