తప్పు తుమ్మలదే, ఊహించలేదు: కేసీఆర్ ఆశ్చర్యం!
హైదరాబాద్: ఖమ్మం జిల్లా సీనియర్ నేత తుమ్మల నాగేశ్వర రావు శుక్రవారం పార్టీలో చేరిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాట్లాడారు. తప్పు తనది కాదని, తుమ్మలదేనని నవ్వుతూ వ్యాఖ్యానించారు. తుమ్మల పార్టీలో చేరుతున్నారంటే ఇంతమంది వస్తారని ఊహించలేదన్నారు. కానీ భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలకు స్వాగతం పలుకుతున్నానన్నారు.
తుమ్మల అనుచర గణంతో టీఆర్ఎస్ భవన్ నిండిపోయిందని, వాస్తవానికి ఈ కార్యక్రమం నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసి ఉంటే బావుండేదన్నారు. కానీ ఇంత మంది వస్తారని ముందుగా ఊహించలేదన్నారు. అందుకే తప్పు తనది కాదని, తుమ్మలదేనని చమత్కరించారు.

తుమ్మల తనకు ఆప్తమిత్రుడన్నారు. తెలంగాణ సంధి సమయంలో ఉందని, వందేళ్లుగా తెలంగాణ కన్నీరు పెడుతోందన్నారు. తుమ్మల తనకు చాలా సన్నిహితులని, దీర్ఘకాలం కలిసి పని చేశామన్నారు. ఖమ్మం జిల్లా తెలంగాణకు తలమానికమన్నారు. జిల్లా నేతలను సమన్వయం చేసుకుని పార్టీని ముందుకు తీసుకెళ్లాలని తుమ్మలను కోరుతున్నానన్నారు.
దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందన్నారు. ఇప్పుడు తెలంగాణ పునర్నిర్మాణం జరుగుతుందన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం కూడా ఓ ఉద్యమమే అన్నారు. బంగారు తెలంగాణ కోసం పాటుపడదామన్నారు. తుమ్మల రాజకీయ దురంధరుడని, ఖమ్మం జిల్లాలో పార్టీని ముందుకు తీసుకెళ్లే ప్రధాన బాధ్యత తీసుకోవాలన్నారు.
తుమ్మల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చ లేని వ్యక్తి అన్నారు. నీతి నిజాయతీ కలిగిన, సమర్థ, విశ్వసనీయత కలిగిన నాయకుడన్నారు. ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మనందరిదన్నారు. త్వరలో కొత్తగూడెం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటవుతుందన్నారు. ఖమ్మం జిల్లాను బ్రహ్మాండంగా చేయాలనుకుంటున్నామన్నారు.












Click it and Unblock the Notifications