బర్త్‌డే రోజే చంద్రబాబుకు షాక్: జగన్‌కూ తప్పలేదు
అమరావతి: అపర కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన టాప్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్.. ట్విట్టర్‌లో మరోసారి పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఆయన చేతుల్లోకి వెళ్లిన తరువాత అక్కడ జరిగే మార్పులకు బ్రేకులు పడట్లేదు. ట్విట్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా బాధ్యతలను స్వీకరించిన తొలి రోజు నుంచే ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపట్టిన ఎలాన్ మస్క్- పెను సంస్కరణలకు తెర తీశారు. దాన్ని కొనసాగిస్తోన్నారు.
సంస్థ ఆదాయాన్ని పెంచుకోవడానికి ఎలాన్ మస్క్- కొత్త వ్యవస్థను తెరమీదికి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇకపై బ్లూ టిక్ వెరిఫికేషన్ ఉన్న ఖాతాదారుల నుంచి నెలకు ఎనిమిది డాలర్లను వసూలు చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించారాయన. అమెరికా, బ్రిటన్‌లో ఈ పెయిడ్ బ్లూ టిక్ వెరిఫికేషన్‌ను అమలు చేశారు. భారత్‌లో ఈ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. భారత్‌లో ట్విట్టర్ బ్లూ టిక్ వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.

ఇప్పటివరకు పరిమితంగా ఉన్న బ్లూ టిక్ వెరిఫికేషన్‌ను అందరికీ వర్తింపజేసినట్లు ట్విట్టర్ యాజమాన్యం తెలిపింది. ప్రతి నెలా 719 రూపాయలను చెల్లించి ఎవ్వరైనా సరే బ్లూ టిక్ వెరిఫికేషన్ పొందవచ్చని స్పష్టం చేసింది. ఎవరైనా ట్విట్టర్ బ్లూ బ్యాడ్జ్‌ను దుర్వినియోగం చేస్తే వారి డబ్బును జప్తు చేస్తామని కూడా హెచ్చరించింది. అలాంటి వారి ఖాతాలను శాశ్వతంగా సస్పెండ్ చేస్తామని మస్క్ తెలిపారు.
ఈ క్రమంలో- చాలామంది హైప్రొఫైల్ ట్విట్టర్ యూజర్లకు షాక్ తగిలింది. తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్ బ్లూ టిక్‌ను వారు కోల్పోయారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, విజయసాయి రెడ్డి, జనసేన అధినేత పవన్ కల్యాణ్, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, మెగాస్టార్ చిరంజీవి..ఇలా చాలామంది ప్రముఖులు ఉన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం అధికారిక ట్విట్టర్ అకౌంట్ల బ్లూ టిక్ కూడా మాయమైంది. జనసేన పార్టీకి చెందిన ట్విట్టర్ అకౌంట్ బ్లూ టిక్ రద్దు కాలేదు. అది యధాతథంగా కొనసాగుతోంది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత రాహుల్ గాంధీ, జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, అరవింద్ కేజ్రీవాల్, బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ తమ ట్విట్టర్ బ్లూ టిక్‌ను కోల్పోయారు.
బాలీవుడ్ సెలెబ్రిటీలు- అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, అలియా భట్ సహా పలువురు సెలెబ్రెటీలు ఈ లిస్ట్‌లో ఉన్నారు. టీమిండియా కేప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ల బ్లూటిక్ రద్దయింది. ఇదే జాబితాలో పోప్ ఫ్రాన్సిస్, ఓఫ్రా విన్‌ఫ్రే, డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. మళ్లీ ఈ బ్లూ టిక్ కోసం సబ్‌స్క్రిప్షన్ వెబ్ ద్వారా నెలకు ఎనిమిది, ఐఓఎస్, ఆండ్రాయిడ్ యాప్ కోసం 11 డాలర్లను చెల్లించాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications