పిక్చర్: టెక్ మహీంద్రలో జాబ్ ఇప్పిస్తామని మోసం
హైదరాబాద్: టెక్ మహీంద్రాలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి 3 లక్షల రూపాయల మేరకు నిరుద్యోగులను మోసగించిన ఇద్దరు వ్యక్తులను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాదులోని అడ్డగుట్టలో వి రాధాకృష్ణ (33) అనే వ్యక్తిని, కార్ఖానా నుంచి మిల్లు సింగ్ (33) అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసారు. టెక్ మహీంద్రలో హ్యూమన్ రిసోర్సెస్ సభ్యులుగా చెప్పుకుని వారు నిరుద్యోగులను మోసం చేశారు.
వారిద్దరు ఆరుగురు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్‌ను మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. బాధితుల్లో ఒక మహిళ మార్చి 22వ తేదీన సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన సివిని వివిధ వెబ్‌సైట్లలో ఫోస్టు చేశానని, తనకు టెక్ మహీంద్ర హెఆర్ టీమ్‌కు చెందిన దిలీప్‌నని చెప్పి ఒకతను ఫోన్ చేశాడని, టెక్ మహీంద్రా పూణే శాఖలో జావా సాఫ్ట్‌వేర్ డెవలపర్ కోసం చూస్తున్నామని చెప్పాడని, ఆ తర్వాత మరో కాల్ వచ్చిందని, టెలిఫోనిక్ ఇంటర్వ్యూ అని చెప్పి ఒకతను మాట్లాడాడని, ఆ తర్వాత తనకు జాబ్ ఆఫర్ లెటర్ వచ్చిందని ఫిర్యాదుదారు వివరించింది.

జాబ్ ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత తన భర్త ఖాతా నుంచి 80 వేల రూపాయలు సికింద్రాబాద్‌లోని తిరుమలగిరిలో గల మిల్లు సింగ్ ఎస్‌బిఐ ఖాతాకు బదిలీ చేసినట్లు ఆమె తెలిపింది.ఆఫర్ లెటర్‌తో ఆమె మార్చి 19వ తేదీన టెక్ మహీంద్రా పూణే శాఖకు వెళ్లింది. దాంతో మోసం వెలుగులోకి వచ్చింది.
దర్యాప్తులో భాగంగా పోలీసులు తొలుత మిల్లు సింగ్‌ను మంగళవారంనాడు అదుపులోకి తీసుకున్నారు. అతని వాంగ్మూలం మేరకు రాధాకృష్ణను బుధవారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు రాధాకృష్ణ నుంచి 40 వేల రూపాయల నగదు, కారు, 2.6 లక్షల రూపాయల విలువ చేసే ఎలక్ట్రానికి పరికరాలు స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications