టీడీపీ కోసం రంగంలోకి ముగ్గురు వ్యూహకర్తలు - గేమ్ ఛేంజ్..!!
ఏపీలో ఎన్నికల పోరు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. ఎన్డీఏ కూటమి వర్సస్ వైసీపీ మధ్య హోరా హోరీ పోరు కొనసాగుతోంది. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ముఖ్య నేతలు ప్రచారం హోరెత్తిస్తున్నారు. టీడీపీ, వైసీపీల వెనుక రాజకీయ వ్యూహకర్తలు కీలక పాత్ర పోషిస్తున్నారు. టీడీపీ కోసం తాజాగా ముగ్గురు వ్యూహకర్తలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. గెలుపు దక్కించుకోవటమే లక్ష్యంగా చంద్రబాబు అడుగులు వేస్తున్న వేళ వీరి పాత్ర కీలకంగా మారుతోంది.
రంగంలోకి వ్యూహకర్తలు
ఏపీలో వైసీపీ కోసం ఐ ప్యాక్ టీం పని చేస్తోంది. వ్యూహకర్త రుషి రాజ్ సింగ్ టీం చాలా రోజులుగా గ్రౌండ్ లో వర్క్ చేస్తోంది. ఎమ్మెల్యేల మార్పులోనూ కీలకంగా పని చేసింది. ఇప్పుడు జగన్ తో సహా పార్టీ నేతల ఎన్నికల ప్రచారం పైన ఎప్పటికప్పుడు నివేదికలు అందిస్తోంది. సామాజిక సమీకరణాలు...ఎన్నికల్లో చేయాల్సిన మార్పుల, అమలు చేయాల్సిన సూచనల పైన సలహాలు అందిస్తోంది. ఇటు టీడీపీ కోసం రాబిన్ శర్మ టీం చాలా రోజులుగా వ్యూహాలు అందిస్తోంది. కొద్ది నెలల క్రితం ప్రశాంత్ కిశోర్ ఎంట్రీ ఇచ్చారు. ప్రశాంత్ కిశోర్ ప్రస్తుతం చంద్రబాబు కోసం పని చేస్తున్నట్లు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం నిర్దారించారు. పీకే వ్యూహాలను టీడీపీ, రాబిన్ శర్మ అమలు చేస్తోంది.

చంద్రబాబు కోసం రంగంలోకి
రాబిన్ శర్మ టీం టీడీపీకి రాజకీయ వ్యూహాలు అందించటం ప్రారంభించిన తరువాత అనేక కార్యక్రమాలు నిర్వహించారు. సూపర్ సిక్స్ పథకాల మొదలు బాదుడే బాదుడు, ప్రజాగళం వంటి కార్యక్రమాలకు రూప కల్పన చేసారు. అభ్యర్దుల ఎంపికలోనూ కీలకంగా వ్యవహరించారు. వైసీపీ అభ్యర్దులకు ధీటుగా సామాజిక సమీకరణాలను అమలు చేస్తూ సర్వేలు చేయించారు. పొత్తుల్లో భాగంగా బీజేపీ, జనసేనకు ఇవ్వాల్సిన సీట్ల విషయంలోనూ సూచనలు అందించారు. అయితే, రాబిన్ శర్మ సూచనలకు భిన్నంగా చంద్రబాబు కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్దులను ఖరారు చేసారు. సర్వే నివేదికల ఆధారంగా మార్పులు వస్తుండటంతో ప్రశాంత్ కిశోర్ సూచనలను తీసుకోవాలని నిర్ణయించారు.

కలిసొచ్చేదెవరికి
తాజాగా ప్రశాంత్ కిశోర్ తాను చంద్రబాబుకు పని చేయటం లేదని చెప్పుకొచ్చారు. కానీ, క్షేత్ర స్థాయిలో మాత్రం ప్రశాంత్ కిశోర్ టీడీపీ కోసం నేరుగా పని చేస్తున్న రాబిన్ శర్మ టీంకు సలహాలు, సూచనలు అందిస్తున్నారని తెలుస్తోంది. ఇదే సమయంలో తాజాగా ఏపీలో పరిస్థితుల పైన కాంగ్రెస్ కు వ్యూహకర్తగా సేవలు అందించిన సునీల్ కనుకోగలు సలహాలు తీసుకున్నట్లుగా సమాచారం. ఆయన కూటమి నుంచి పోటీ చేస్తున్న అభ్యర్దుల ఎంపిక విషయంలో కొన్ని మార్పులు చేసినట్లు పార్టీలో చర్చ సాగుతోంది. ఇక.. ఎన్నికల సమయంలో వీరి సలహాలు టీడీపీకి ఏ మేర మేలు చేస్తాయనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. ఇటు వైసీపీకి ఐ ప్యాక్ సహకారం అందిస్తోంది. దీంతో...వ్యూహకర్తల్లో ఎవరి లెక్కలు కలిసి వస్తాయనేది ఆసక్తి కరంగా మారుతోంది.













Click it and Unblock the Notifications