గుంటూరు జిల్లాలో విషాదం: ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి
అమరావతి: గుంటూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రెంటచింతల మండలంలోని పాల్వాయిలో గురువారం ఉదయం చోటు చేసుకున్న విద్యుదాఘాతంతో ఇద్దరు రైతులు మృత్యువాతపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం పాల్వాయికి చెందిన మందలపు శ్రీనివాసరెడ్డి(38), మందలపు మట్టారెడ్డి(35) ఇద్దరు అన్నదమ్ములు.
వీరిద్దరూ మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి గురువారం ఉదయం తమ పొలంలో కొత్తగా వేసిన వ్యవసాయ బోరుకు విద్యుత్ తీగలు అమర్చుతున్నారు. ఈ సమయంలో కరెంట్ తీగలు తుమురుకోట హెచ్‌టీ విద్యుత్తు తీగలకు తాకడంతో విద్యుదాఘాతం జరిగింది.
దీంతో శ్రీనివాసరెడ్డి, మట్టారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని గురజాల ప్రభుత్వాసుపత్రికి తరలించే లోపే మృతి చెందారు. మృతులిద్దరూ ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న రెంటచింతల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కుక్కల దాడిలో జింక మృతి
చిలకలూరిపేటకు సమీపంలోని మురికిపూడి గ్రామంలో గురువారం ఉదయం పొల్లాల్లో నుంచి వచ్చిన జింకపై ఒక్కసారిగా కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో జింక అక్కడికక్కడే మృతిచెందింది. పెద్ద సంఖ్యలో గ్రామస్థులు ఈ ప్రాంతానికి చేరుకున్నారు. సమాచారాన్ని అటవీ అధికారులకు అందజేశారు.
ఆయిల్‌పీపా కిందపడి యువకుడి మృతి
వడ్లమూడి గ్రామంలో ఆయిల్ పీపా కిందపడి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన బుధవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.... పిడుగురాళ్ల మండలం దమ్మల చెరువు గట్టు గ్రామానికి చెందిన నాగుల్ మీరా( 25) స్థానిక వీఎన్‌ఆర్ ప్రైవేటు సంస్థలో కూలీగా పనిచేస్తున్నాడు.
తారురోడ్డు నిర్మాణంలో వినియోగించే ఎమల్షన్ ఆయిల్ పీపాలను లారీలో లోడ్ చేస్తుండగా నాగూర్‌మీరా జారీపడడంతో అతని తలపై పీపా పడి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం 108లో తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications