ఒకేసారి విద్యార్థినిని కాటేసిన రెండు పాములు.. విధి ఆడిన వింతఆటకు బాలిక బలి
వర్షాకాలంలో ప్రధానంగా పాము కాటు వేసిన ఘటనలు అనేకం వింటూ ఉంటాం. సహజంగా పాము కాటు వేయటం విని ఉంటాం కానీ, ఒకే వ్యక్తిని, ఒకేసారి రెండు పాములు కాటు వేసిన ఘటన అరుదుగా జరుగుతూ ఉంటుంది. అటువంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
ఓ బాలికపై విధి వింత ఆట ఆడింది. ఒకేసారి రెండు పాములు కాటేసిన విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా నందవరం మండలం నది కైరవాడి గ్రామం యానంలో చోటుచేసుకుంది. చాకలి నాగరాజు నరసమ్మ అనే దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మూడవ కుమార్తె మల్లీశ్వరి మంత్రాలయంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతుంది. గత మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి పడుకున్న మహేశ్వరిని రాత్రి 11 గంటల ప్రాంతంలో రెండు పాములు కాటేశాయి.

సుమారు 11గంటల సమయంలో తన చేతిపైన, కాలిపైన ఏదో కరిచిందని మహేశ్వరి ఏడుస్తూ నిద్రలేచి తండ్రికి చెప్పింది. లైట్లు వేసి చూడగా మల్లీశ్వరి చేతి వద్ద ఒక పాము, కాలు వద్ద మరో పాము కనిపించాయి. దీంతో వెంటనే రెండు పాములను చంపి మల్లీశ్వరిని ఆసుపత్రికి తీసుకు వెళ్లి చికిత్స అందించారు. అయితే రెండు పాములు కరవడంతో మహేశ్వరి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రి నుండి మళ్ళీ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ లో తరలించారు. అక్కడ మహేశ్వరికి వైద్య చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది.
రెండు రోజులపాటు ప్రాణాల కోసం కొట్లాడిన మహేశ్వరి చివరకు ప్రాణాలను కోల్పోయింది. ఇక మహేశ్వరి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. రెండు పాములు కరిచి కుమార్తె మరణంతో కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. వర్షాకాలంలో ప్రజలు పాముల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఇళ్ళలో చెత్త చెదారం లేకుండా చూసుకోవాలని అధికారులు చెప్తున్నారు.












Click it and Unblock the Notifications