మేమిద్దరం మంచి దోస్తులం.. ఎపి స్పీకర్ ఇంట తెలంగాణా స్పీకర్ సందడి...
గుంటూరు: ఆయనో రాష్ట్ర శాసనసభకు స్పీకర్...ఈయనో స్టేట్ అసెంబ్లీ స్పీకర్...ఇద్దరూ ఒకే చోట కలిసి...మేమిద్దరం మంచి దోస్తుల మంటూ సందడి చేశారు. ఈ అరుదైన దృశ్యానికి ఎపి స్పీకర్ కోడెల నివాసం వేదికగా మారింది. ఎలాగంటే...
తెలంగాణ శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళుతున్నారు. గుంటూరు వరకు రాగానే తన పాత స్నేహితుడు ప్రస్తుతం ఎపి స్పీకర్ కోడెల శివప్రసాదరావు గుర్తుకు వచ్చారు. అంతే వాహనం వెంటనే ఆయన ఇంటివైపు మళ్లించారు. తన కుటుంబంతో సహా గుంటూరులోని ఏపీ స్పీకర్ కోడెల నివాసానికి వెళ్లారు. అనూహ్యంగా తెలంగాణా స్పీకర్ రాకతో డాక్టర్ కోడెల సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. మధుసూధనాచారి కుటుంబానికి కోడెల కుటుంబ సభ్యులు సాదర ఆహ్వానం పలికారు.

ఈవిషయం తెలిసి మీడియా ప్రతినిథులు వెంటనే కోడెల నివాసం వద్దకు వెళ్లి ఇరువురు స్పీకర్లను కలిశారు.ఈ సందర‍్భంగా ఇరువురు స్పీకర్లు మీడియాతో మాట్లాడుతూ తామిద్దరం మంచి దోస్తులం అని, గతంలో ఒకే పార్టీలో పనిచేశామని, ఎప్పటినుంచో తమ మధ్య సన్నిహిత సంబంధాలున్నాయని చెప్పారు. ఎపి, తెలంగాణా గురించి మాట్లాడుతూ రెండు రాష్టాలు సఖ్యతతో పనిచేస్తున్నాయన్నారు. అలాగే ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర అవగాహన ఉందన్నారు. శాసనసభ వ్యవహారాలలో కూడా ఇద్దరం సమన్వయంతో పనిచేస్తున్నామని వారు తెలిపారు.

ఆ తరువాత తెలంగాణా స్పీకర్ తిరుపతి వెళుతున్న విషయం తెలుసుకున్న ఎపి స్పీకర్ కోడెల తిరుమలలో, అలాగే విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయాల్లో ఎలాంటి ప్రోటోకాల్ ఇబ్బంది లేకుండా మధుసూదనాచారి కుటుంబ సభ్యులకు దర్శన భాగ్యం కల్పించాలని సంబంధిత దేవాలయాల అధికారులను స్పీకర్ కోడెల ఆదేశించారు.












Click it and Unblock the Notifications