వినోదంలో విషాదం: ఇద్దరు విద్యార్థుల మృతి, మరో ఇద్దరు గల్లంతు
హైదరాబాద్: వినోద యాత్రలో విషాదం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా సూర్యలంక బీచ్‌కు సముద్ర స్నానానికి వెళ్లిన విద్యార్థుల్లో నలుగురు గల్లంతయ్యారు. మొత్తం 13 మంది విద్యార్థులు శుక్రవారం సముద్ర స్నానానికి వెళ్లారు.
ప్రమాదవశాత్తు సముద్రంలో నలుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. వారిలో ఇద్దరి శవాలు ఒడ్డుకు కొట్టుకుని వచ్చాయి. మరో ఇద్దరు విద్యార్థుల కోసం గాలింపు చర్యలు సాగుతున్నాయి. మరణించినవారి మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

విద్యార్థులంతా వడ్లమూడి విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందినవారు. శుక్రవారం ఉదయం వారు సూర్యలంక సముద్ర తీరానికి వెళ్లారు. గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం రాంభొట్లవారిపాలెంకు చెందిన గుడివాడ కృష్ణప్రసాద్, నల్లగొండ జిల్లాకు చెందిన మహేష్ మృతి చెందారు.
తెనాలి పట్టణానికి చెందిన శ్రీనివాస్, గుంటూరుకు చెందిన జైదేవ్ గల్లంతయ్యారు. ఘటనా స్థలంలో ఆర్డీవో నరసింహులు, బాపట్ల తహశీల్దార్, సిఐ శ్రీనివాస్ గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు. విద్యార్థులంతా మెకానికల్ ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నారు.












Click it and Unblock the Notifications