ఎల్లుండి టీడీపీలోకి ఆ ఇద్దరు వైసీపీ ఎంపీలు?
ఏపీలో ఎన్నికల వేళ రాజకీయ పార్టీల నుంచి ప్రజాప్రతినిధుల ఫిరాయింపులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీ చేపట్టిన ఇన్ ఛార్జ్ ల మార్పు కారణంగా సీట్లు కోల్పోయిన ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఆ తర్వాత విపక్ష టీడీపీ, జనసేనలోకి చేరిపోతున్నారు. ఇదే కోవలో మరో ఇద్దరు ఎంపీలు వైసీపీకి గుడ్ బై చెప్పేసి టీడీపీ తీర్ధం పుచ్చుకునేందుకు సిద్దమవుతున్నారు.
వైసీపీ ఇన్ ఛార్జ్ ల మార్పుల్లో వైసీపీ నుంచి నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలను గుంటూరు ఎంపీగా వెళ్లాలని జగన్ ఆదేశించారు. కానీ ఆయన గుంటూరు వెళ్లేందుకు ఇష్టపడలేదు. చివరికి కార్యకర్తల్లో గందరగోళం నెలకొనడం ఇష్టం లేదంటూ వైసీపీకి రాజీనామా చేస్తానని ప్రకటించేశారు. అనంతరం టీడీపీ నేతలతో టచ్ లోకి వెళ్లిపోయారు.

ఈ మధ్యే చంద్రబాబుతో మరోసారి భేటీ అయిన లావు.. మార్చి 2న టీడీపీ తీర్ధం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. మార్చి 2న చంద్రబాబు పల్నాడు టూర్ లో లావు శ్రీకృష్ణదేవరాయలు చేరిక ఖాయమైంది. ఆయనతో పాటు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి కూడా చేరతారు.
మరోవైపు నెల్లూరు వైసీపీ ఎంపీ ఇన్ చార్జ్ గా ప్రకటించిన కీలక నేత, రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా ఆ పార్టీకి ఇప్పటికే గుడ్ బై చెప్పారు. నెల్లూరు ఎంపీగా తనను ఎంపిక చేసిన జగన్.. ఆ తర్వాత ఎమ్మెల్యేల మార్పుల్ని తనకు తెలియకుండానే చేసేస్తుండటంతో అసంతృప్తికి గురయ్యారు. చివరికి వైసీపీకి గుడ్ బై చెప్పేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు ఆయన కూడా చంద్రబాబు సమక్షంలో మార్చి 2న టీడీపీలో చేరబోతున్నారు. ఆ తర్వాత వేమిరెడ్డిని నెల్లూరు ఎంపీ అభ్యర్ధిగా టీడీపీ ప్రకటించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications