బాబు ప్రభుత్వంపై కేంద్ర మంత్రికి కెసిఆర్ ఫిర్యాదు: గవర్నర్‌తో భేటీ
హైదరాబాద్: విభజన చట్టం అమలులో తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి సరిగా లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. శనివారం హైదరాబాద్ వచ్చిన కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర ప్రసాద్ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఏపీ ప్రభుత్వంతో నెలకొన్న పలు అంశాల ప్రతిష్టంభనను రవి శంకర ప్రసాద్‌కు వివరించారు.

రాజధాని నగరంలో ఐటీఐఆర్ ప్రాజెక్టుకు త్వరితగతిన పూర్తి చేయడానికి సహకరించాలని రవి శంకర ప్రసాద్‌కు కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాదులో ఐటీ అభివృద్ధి, ఎగుమతులు, ఉద్యోగ అవకాశాలపై తెలంగాణ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది. ఈ భేటీలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కెసిఆర్‌తో భేటీకి ముందు రవిశంకర్ ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. సాంకేతిక పరిజ్ఞానం, సేవ కలిస్తే దేశ వికాసానికి ప్రయోజనం చేకూరుతుందని ఆయన అన్నారు. ఎలక్ట్రానికి రంగాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. దాని అభివృద్ధికి సమయం ఆసన్నమైందని, ప్రణాళికలు సిద్ధం చేశామని అన్నారు. గ్రామాలన్నింటినీ ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌తో అనుసంధానం చేస్తామని మంత్రి చెప్పారు.

ఏడు లక్షల కిలోమీటర్ ఆప్టికల్ ఫైబర్ పనులు మూడేళ్లలో పూర్తవుతాయని అన్నారు. ఎన్జీవోలు దేశ వికాసానికి కృషి చేస్తున్నట్లు రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. కొన్ని ఎన్జీవోలు తీవ్రవాదులకు సహకరించడం దురదృష్టకరమని ఆయన అన్నారు.

16న మంత్రి వర్గ విస్తరణ
ఇదిలావుంటే, రాజభవన్‌లో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కలిశారు. మంత్రివర్గ విస్తరణపై ఆయన గవర్నర్‌తో మాట్లాడినట్లు సమాచారం. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఈనెల 17న జరుగనుంది. మంచి రోజు కావడంతో 16న విస్తరణ జరపాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఈ మంత్రివర్గంలో జూపల్లి, కొప్పుల, తుమ్మలకు పదవులు ఖరారయ్యాయి. అలాగే మహిళ కోటాలో వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కొండా సురేఖ, కోవాలక్ష్మికి మంత్రి పదవులు ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కేబినెట్ విస్తరణలో ఇటీవల పార్టీలో చేరిన తలసాని శ్రీనివాస్ పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications