జగన్ పై విమర్శలు చేయను, అది బాధ్యత - టీడీపీతో చర్చకు సిద్దం: ఉండవల్లి..!!
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేసారు. తాను ఒక కొన్నాళ్ల పాటు జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయనని వెల్లడించారు. ఎందుకు విమర్శలు చేయవని అడిగే వారికి ఆ అర్హత లేదని వ్యాఖ్యానించారు. మార్గదర్శిలో అక్రమాల పైన ఆయన పలు ఆసక్తి కర అంశాలను ప్రస్తావించారు. ఏపీ పునర్విభజన అంశంలో జగన్ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ తనకు బలాన్ని ఇచ్చిందన్నారు. మార్గదర్శితో పాటుగా పోలవరం సహా అన్ని అంశాలపైన టీడీపీతో చర్చకు సిద్దమని చెప్పారు. రామోజీకి అనుకూలంగా జనసేన ప్రకటనలపై స్పందించారు.
జగన్ స్పందించారు:ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర ప్రయోజనాలపైన స్పందించారని ఉండవల్లి పేర్కొన్నారు. ఏపీ విభజన చట్టమే తప్పని చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి అన్యాయం జరిగిందని తాను సుప్రీంకోర్టులో కేసు వేసిన విషయాన్ని గుర్తు చేసారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో కేసులో ఇంప్లీడ్ కావాలని కోరగా స్పందించలేదన్నారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం అయినా ఇంప్లీడ్ కావాలని తాను ఒక మీడియా సమావేశంలో కోరగానే ప్రభుత్వం ఇంప్లీడ్ అయిందన్నారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు సుప్రీంకేసులో ఇంప్లీడ్ అయిందని చెప్పారు. అదే విధంగా మార్గదర్శి ఫైనాన్షియర్స్ పై తాను వేసిన కేసులోనూ జగన్ ప్రభుత్వం ఇంప్లీడ్ అయిందని, తెలంగాణ ప్రభుత్వం మాత్రం కాలేదన్నారు.

జగన్ కు బాధ్యత ఉంది:మార్గదర్శి ఛిట్ పండ్ అక్రమాల విషయంలో జగన్ ప్రభుత్వం సక్రమంగా వ్యవహరిస్తోందన్నారు. మార్గదర్శి అక్రమాల కేసును సక్రమంగా విచారించి సరైన పరిష్కారం చూపించాల్సిన బాధ్యత జగన్ పైన ఉందదని ఉండవల్లి పేర్కొన్నారు. మార్గదర్శి అక్రమాలకు అడ్డుకట్ట వేసి ప్రజలకు న్యాయం చేయటం వైఎస్ ఆశయాల్లో ముఖ్యమైనదిగా పేర్కొన్నారు. దీనిని నిర్వర్తించాల్సిన బాధ్యత జగన్ కు ఉందని చెప్పుకొచ్చారు. మార్గదర్శి రామోజీరావుకు అనుకూలంగా టీడీపీ, కమ్యూనిస్టులతో పాటు జనసేన కూడా ప్రకటనలు చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. తన పై ఎంత దుష్ప్రచారం చేసినా జరగాల్సింది జరిగి తీరుతుందని ఉండవల్లి పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ టికెట్ల కోసం పోటీ పడుతున్న వారంతా రామోజీకి అనుకూలంగా ప్రకటనలు ఇస్తున్నారని వ్యాఖ్యానించారు.
పోలవరం పై ఎందుకలా:మార్గదర్శితో సహా ఇతర అంశాలపైన తాను టీడీపీతో చర్చకు సిద్దమని ఉండవల్లి స్పష్టం చేసారు. చంద్రబాబు పైన వ్యక్తిగత ఆరోపణలు..ఆస్తుల వ్యవహారాల పైన తాను అడగనని చెప్పారు. చంద్రబాబు హయాం లో జరిగిన నిర్ణయాల పైనే చర్చిస్తానని..పార్టీ అధికార ప్రతినిధిని పంపాలని కోరారు. జాతీయ ప్రాజెక్టు పోలవరం కేంద్రం పూర్తి చేయాల్సి ఉంటే చంద్రబాబు ఎందుకు నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారని ఉండవల్లి ప్రశ్నించారు. అసెంబ్లీలో చంద్రబాబు కేంద్రమే తమకు అప్పగించిందని చెప్పారని, నీతి అయెగ్ మాత్రం నాటి రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్ధన మేరకే కేంద్ర జలశక్తికి తాము రాష్ట్రానికి బాధ్యతలు ఇవ్వాలని సిఫార్సు చేసామని చెబుతోందని ఉండవల్లి వివరించారు. ఇటువంటి వాటి పైనే తాను చర్చకు ఆహ్వానిస్తున్నానని ఉండవల్లి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications