విశాఖలో 'శ్రీకృష్ణ' అద్భుతం: అండర్ వాటర్ మెడిటేషన్ సెంటర్, స్వర్గం అనుభూతి!
విశాఖ: ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణా కన్సెస్‌నెస్ విశాఖ యూనిట్ నీటిలో ధ్యాన కేంద్రాన్ని (అండర్ వాటర్ మెడిటేషన్ హాల్) నిర్మించే యోచనలో ఉంది. భారత దేశంలోనే తొలిసారి దీనిని నిర్మించాలని ఈ సంస్థ వైజాగ్ యూనిట్ భావిస్తోంది.
దీంతో పాటు, భూగర్భంలో 45 నిమిషాల పాటు రైడ్ చేయగలిగే ట్రామ్ నిర్మించాలని భావిస్తోంది. ఇప్పటికే అమరావతి రూపంలో ప్రపంచస్థాయి రాజధానిని నిర్మించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఏపీ కీర్తి కిరీటంలో మరో కలికితురాయిలా... రుషికొండ వద్ద అండర్ వాటర్ ధ్యాన కేంద్రాన్ని నిర్మించాలని సదరు సంస్థ భావిస్తోంది.
ఈ అండర్ వాటర్ ధ్యాన కేంద్రాన్ని సింగపూర్‌లోని అండర్ వాటర్ వరల్డ్ మోడల్‌లో నిర్మించాలని యోచిస్తోంది. శ్రీకృష్ణ భగవానుడి చిత్రాలతో, అతని జీవిత చరిత్రకు సంబంధించిన కథలతో అండర్ వాటర్ గ్లాస్ హౌస్ ఉంటుంది.

దీంతో పాటు 45 నిమిషాల పాటు భూగర్భ ట్రామ్ ప్రయాణం ద్వారా భక్తులకు ఎన్నో అనుభూతులు కల్పించాలని ఆ సంస్థ భావిస్తోంది. ఇందులో స్వర్గం, నరకం అనుభవాలను కూడా చూపించనున్నారని తెలుస్తోంది.
ఇందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు పొందినట్లుగా తెలుస్తోంది. త్వరలో తొలి దఫా పనులు ప్రారంభించనున్నారు. ఈ నిర్మాణం ద్వారా భక్తులకు కొత్త అనుభూతి కల్పిస్తామని ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణా కన్సెస్‌నెస్ విశాఖ యూనిట్ చెబుతోంది.












Click it and Unblock the Notifications